కారు డ్రైవ్ చేస్తున్న 5ఏళ్ల బుడ్డోడు…పోలీసులు షాక్

10TV Telugu News

ఓ 5ఏళ్ల బాలుడు  అమెరికా పోలీసులను స్టన్ అయ్యేలా చేశాడు. త‌ను కోరింది ద‌క్కాల్సిందేన‌న్న‌ మంకుప‌ట్టుతో 5ఏళ్ల బుడతడు కారు వేసుకుని కాలిఫోర్నియాకు బయలుదేరాడు. హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆ బుడ‌త‌డు డ్రైవింగ్ చేయ‌డం చూసి ఖంగు తిన్నారు. ఈ ఆశ్చ‌ర్య‌క‌ర ఘ‌ట‌న సోమ‌వారం అమెరికాలోని ఉటావాలో జ‌రిగింది.

అమెరికాలోని ఊటా రాష్ట్రంలో ఓ ఐదేళ్ల బాలుడు తన తల్లిని ఖరీదైన లంబోర్గిని కారు కొనివ్వ‌మ‌ని అడిగాడు. అయితే అందుకు పిల్లాడి తల్లి నిరాకరించింది. కాసేపు తల్లితో గొడవపడ్డాడు. అయితే సాధారణంగా తాము అడిగింది కొనివ్వకపోతే పిల్ల‌లు అలుగుతుండటం స‌హ‌జం. మహా అయితే కొద్ది సేపు ఏడ్చి ఊరుకుంటారు. కానీ ఈ 5ఏళ్ల బుడ్డోడు మాత్రం అలిగి బుంగ‌మూతి పెట్టుకుని కూర్చోలేదు. త‌ను కోరింది ద‌క్కాల్సిందేన‌న్న‌ మంకుప‌ట్టుతో చెప్పాపెట్టకుండా ఇంటి షెఢ్‌లో ఉన్న SUVకారులో..లంబోర్గిని కారు కొనుక్కోవాలని కాలిఫోర్నియాకు బయల్దేరాడు.

హైవేపై నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాడో లేదో హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఏదో తేడా అనిపించి కారు ఆపారు. ఆ బుడ‌త‌డు డ్రైవింగ్ చేయ‌డం చూసి పోలీసులు ఖంగు తిన్నారు. అడిగితే వయసు, బయలుదేరిన పని అర్తమైపోయి నోరు వెళ్లబెట్టారు. నీకు ఐదేళ్లే క‌దా? ఇంత చిన్న వ‌య‌సులో డ్రైవింగ్ ఎక్క‌డ నేర్చుకున్నావ్? అంటూ ప్ర‌శ్న‌లు కురిపించారు.

కారు కొనేందుకు బయలుదేరావా.. మరి డబ్బులున్నాయా అంటే ‘కొంచెం తక్కువ ఉన్నాయి అని టక్కున సమాధానమిచ్చాడు. ఇంతకూ ఎంతున్నాయి నీ దగ్గర’ అని అడిగితే 3 డాలర్లు అని చెప్పాడు. 5ఏళ్ల బుడతడిని మంద‌లించి అతడిని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు పోలీసులు. అదృష్ట‌వ‌శాత్తూ అత‌ని డ్రైవింగ్‌లో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు తెలిపారు.

Also Read |  బైక్‌పై ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్లాడు… పెళ్లి చేసుకున్నాడు