IPL 2023: అక్ష‌ర్ ప‌టేల్ పై ఆరోన్ ఫించ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

అక్ష‌ర్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్(Aaron Finch) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అక్ష‌ర్ ప‌టేల్‌కు కెప్టెన్సీ అంటే ఆస‌క్తి లేన‌ట్లుగా అనిపిస్తుంద‌న్నాడు.

IPL 2023: అక్ష‌ర్ ప‌టేల్ పై ఆరోన్ ఫించ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Axar Patel

Updated On : May 3, 2023 / 3:43 PM IST

IPL 2023:ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) ప్ర‌యాణం ఆశించిన విధంగా లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడ‌గా కేవ‌లం మూడు మ్యాచుల్లోనే విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. ఇక పై జ‌రిగే అన్ని మ్యాచుల్లో విజ‌యం సాధిస్తే త‌ప్ప ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు చేర‌డం చాలా క‌ష్ట‌మే. జ‌ట్టు ఆట‌తీరును కాస్త ప‌క్క‌న బెడితే టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్(Axar Patel) మాత్రం అద‌ర‌గొడుతున్నాడు.

కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ త‌రువాత 133.71 స్ట్రైక్ రేట్‌తో 34 సగటుతో 238 ప‌రుగులు చేసి ఈ సీజ‌న్‌లో ఢిల్లీ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. 6.93 ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ నేప‌థ్యంలో అక్ష‌ర్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్(Aaron Finch) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అక్ష‌ర్ ప‌టేల్‌కు కెప్టెన్సీ అంటే ఆస‌క్తి లేన‌ట్లుగా అనిపిస్తుంద‌న్నాడు.

IPL 2023, DC vs GT: గుజ‌రాత్‌కు షాక్‌.. ప్ర‌తీకారం తీర్చుకున్న ఢిల్లీ

జ‌ట్టుకు అవస‌రం అయిన స‌మ‌యంలో అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో త‌న వంతు స‌హ‌కారం అందించాడ‌ని చెప్పాడు. వైస్‌ కెప్టెన్ అయిన అక్షర్ పటేల్ జట్టులో తన పాత్ర పట్ల సంతోషంగా ఉంటాడని ఫించ్ అభిప్రాయపడ్డాడు. అతను నాయకత్వాన్ని డిమాండ్ చేసే వ్యక్తిగా కనిపించడని అన్నాడు. సమీప భవిష్యత్తులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ కోసం దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అక్షర్ పటేల్‌కు మద్దతు ఇచ్చిన సమయంలో ఫించ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

2022 డిసెంబ‌ర్‌లో జ‌రిగిన కారు ప్ర‌మాదంలో ఢిల్లీ జ‌ట్టు కెప్టెన్ అయిన రిష‌బ్ పంత్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అత‌డు వేగంగా కోలుకుంటున్నాడు. దీంతో ఈ సీజ‌న్ నుంచి అత‌డు త‌ప్పుకున్నాడు. రిష‌బ్ స్థానంలో ఈ సీజ‌న్‌కు సీనియ‌ర్ ఆట‌గాడు అయిన డేవిడ్ వార్న‌ర్‌ను ఢిల్లీ యాజ‌మాన్యం కెప్టెన్‌గా నియ‌మించింది. అదే స‌మ‌యంలో అక్ష‌ర్ ప‌టేల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఢిల్లీ ఆట‌తీరు మారాలంటే అక్ష‌ర్ ప‌టేల్‌కు కెప్టెన్సీ ఇవ్వాల‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

IPL 2023: మళ్లీ రచ్చరచ్చ చేశారు.. గంభీర్, కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం.. అడ్డుకున్న ఇరు జట్ల సభ్యులు .. వీడియోలు వైరల్