AP 10th Exams: జూలై 26 నుంచి టెన్త్ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?

గత ఏడాది నుండి కరోనా ప్రభావంతో పెన్ను, పేపర్ లేకుండానే విద్యార్థులంతా పాసైపోయారు. గత ఏడాది ఇదీ.. అదీ అని లేకుండా టెన్త్ నుండి పీజీల వరకు.. టెక్నీకల్ కోర్సులతో సహా అన్నీ రద్దు చేసి పాసైపోయినట్లుగా ప్రకటించారు. ఈ ఏడాది కూడా సీబీఎస్ఈతో సహా పలు రాష్ట్రాలలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు.

AP 10th Exams: జూలై 26 నుంచి టెన్త్ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?

Ap 10th Exams

AP 10th Exams: గత ఏడాది నుండి కరోనా ప్రభావంతో పెన్ను, పేపర్ లేకుండానే విద్యార్థులంతా పాసైపోయారు. గత ఏడాది ఇదీ.. అదీ అని లేకుండా టెన్త్ నుండి పీజీల వరకు.. టెక్నీకల్ కోర్సులతో సహా అన్నీ రద్దు చేసి పాసైపోయినట్లుగా ప్రకటించారు. ఈ ఏడాది కూడా సీబీఎస్ఈతో సహా పలు రాష్ట్రాలలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా తెలంగాణలో పరీక్షలు రద్దు చేయగా.. ఏపీలో మాత్రం వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ సహా విద్యాశాఖాధికారులు కూడా టెన్త్ పరీక్షలు జరిపి తీరుతామని ప్రకటిస్తూ వస్తున్నారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే పరీక్షలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నామని సీఎం పలుమార్లు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు మారుతూ వస్తున్న పరీక్షల తేదీలు ఈసారి జులై 26కు ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం అని చెప్పారు.

అయితే.. ఈసారైనా పరీక్షల నిర్వహణ సాధ్యమేనా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుంది. బుధవారం కూడా ఆరువేలకు పైగా కేసులు నమోదవగా మరోసారి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను కూడా పొడిగించారు. ఇప్పటికే మనం జూన్ నెల సగం పూర్తవగా.. ప్రభుత్వం ప్రకటించిన పరీక్షల తేదీకి మరో నలభై రోజులు మాత్రమే సమయముంది. మరి ఈలోగా కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందా అన్నది ప్రశ్నార్ధకంగా కనిపిస్తుంది.

మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు ఉండనుందని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతుండగా నిపుణులు సైతం పలు హెచ్చరికలు చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సాహసిస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరీక్షల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ప్రభుత్వం మాత్రం పట్టుదలతోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీనిపై గురువారం సీఎం జగన్ ఇదే అంశంపై సమావేశం కూడా నిర్వహించనుండగా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే.. నలభై రోజుల తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది? పరీక్షల నిర్వహణకు అన్నీ అనుకూలమవుతాయా అన్నది చూడాల్సి ఉంది.