Assembly Elections 2021 : ఆ రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఇక పోలింగ్ జరగడమే తరువాయి
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం పోటాపోటీగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్ ముగిసింది. తమిళనాడు, అసోం, కేరళ, బెంగాల్ లో మూడోదశ ఎన్నికల ప్రచారం ముగిసింది.

Assembly Elections 2021 Live Updates
Assembly Elections 2021 Live Updates : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం పోటాపోటీగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్ ముగిసింది. తమిళనాడు, అసోం, కేరళ, బెంగాల్ లో మూడోదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. తమిళనాడులో రాత్రి 7 గంటలకు ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 6న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని అన్నాడీఎంకే ఆరాటపడుతుండగా.. దశబ్దకాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్ లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది.
జాతీయ నేతల్లో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ సహా పలువురు రాజకీయ నేతలు గత కొన్నిరోజులుగా భారీ ర్యాలీలతో పార్టీ తరపున ప్రచారాన్ని నిర్వహించారు. కేరళలో కూడా భారీగా రోడ్ షోలు, ర్యాలీలను నిర్వహించారు. సీఎం పినరయి విజయన్ సొంత నియోజకవర్గంలో ఒకటైన కన్నూరులోని ధర్మదమ్లో, తిరువనంతపురంలోని నీమోమ్ లో కోజికోడ్ జిల్లాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
నందిగ్రామ్ పోలింగ్ బూత్ వద్ద జరిగిన విషయంపై మమతా ఎన్నికల సంఘానికి ఏప్రిల్ 1న ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ మమతాకు లేఖను పంపారు. ఇక ఐదు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు అసోం, పాండుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మే 2న విడుదల అవుతాయి.