Baahubali: తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని రోజు..!

తెలుగు సినిమా చరిత్రలో ఒక మరిచిపోలేని, ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకుని వెళ్లడంలో ముఖ్యమైన రోజు నేడు(6 జులై 2021).

Baahubali: తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని రోజు..!

Baahubali Sized Crowd Welcomed Prabhas On The First Day Of Filming

Baahubali First Day Shoot: తెలుగు సినిమా చరిత్రలో ఒక మరిచిపోలేని, ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకుని వెళ్లడంలో ముఖ్యమైన రోజు నేడు(6 జులై 2021). తెలుగు సినిమా చరిత్రను కచ్చితంగా బాహుబలికి ముందు.. తర్వాత అని కచ్చితంగా రాసుకోవచ్చు. రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో వేల మంది జనం మధ్య రాక్‌గార్డెన్‌లో ఓ తెలుగు సినిమా మొదలైంది. సినిమా పేరు బాహుబలి. అప్పటికి తెలియదు.. ఆ ఒక్క సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తుందని, అప్పటికి తెలియదు.. తెలుగు సినిమా మార్కెట్ వేల కోట్లకు పరిగెడుతుందని. అప్పుడే ఎనిమిదేళ్లు అయిపోయింది సినిమా మొదలయ్యి.

ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు, ఎన్నో విజయాలు.. అంతకుమించి రాబట్టిన కలెక్షన్లు.. అప్రతిహత విజయాలతో అప్పటికే హిట్ సినిమాలతో దూసుకుపోతున్న రాజమౌళి, వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ప్రభాస్‌తో ఓ సినిమా తియ్యనున్నట్లు ప్రకటించారు. 2011, ఫిబ్రవరిలో.. జనవరి, 2013లో సినిమా వర్కింగ్ టైటిల్ బాహుబలి అని వెల్లడించారు. అనుష్క హీరోయిన్‌గా, విలన్‌గా రానా దగ్గుబాటి చెయ్యనున్నట్లు చెప్పారు. అదే ఏడాది చివరలో సినిమాలో మరో హీరోయిన్ తమన్నాను తీసుకున్నట్టుగా వెల్లడించింది చిత్రయూనిట్.

భారీతారాగణం ప్రకటించడంతో.. సినిమా బడ్జెట్‌ కూడా ఎక్కువే అని తెలియడంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. రెండేళ్ల ప్రీప్రొడక్షన్ పనులు అయ్యాక.. షూటింగ్ జూలై 6, 2013న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో స్టార్ట్ అయ్యింది. సినిమాలో భాగమైన మాహిష్మతి రాజ్యానికి సంబంధించిన భారీ సెట్టుని రామోజీ ఫిలింసిటీలో సాబు సిరిల్ ఏర్పాటుచేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. షూటింగ్‌కి 30వేల మంది జనాలు రావడంతో వారిని అదుపు చేయడం కష్టం అయ్యింది.

ప్రభాస్, రానాలు జనాల్లోకి వచ్చి అదుపు చెయ్యగా.. ఆ సమయంలో దర్శకుడు రాజమౌళి వారి మధ్యలో నిలబడి “జై బాహుబలి” అని గట్టిగా నినాదాలు చేయించారు. అప్పుడు చేసిన నినాదాలను సినిమాలో కావలసిన చోట వాడుకున్నారు. “బాహుబలి-ది బిగినింగ్” సినిమా 2015వ సంవత్సరం జూలై 10వ తేదీన విడుదలవ్వగా.. ఈ సినిమాకు కొనసాగింపుగా బాహుబలి- ది కన్‌క్లూజన్ 2017 ఏప్రిల్ 28వ తేదీన విడుదలైంది. రెండు సినిమాలు మొత్తం బడ్జెట్ 375కోట్ల రూపాయలు అవ్వగా.. 2015లో విడుదలైన మొదటి భాగమే రూ.500కోట్లు వసూలు చేసింది. రెండేళ్ల తర్వాత వచ్చిన రెండో భాగం ఏకంగా 2వేల కోట్లు రాబట్టింది.

ఎంత బాగున్నా కూడా 375కోట్లు ఎలా రాబడుతుందో అని వెక్కిరించిన వేరే ఇండస్ట్రీల వాళ్లు కూడా ముక్కున వేలేసుకునేలా ఈ విజయం కనిపించింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించగా, రాజమౌళి సోదరుడు, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించగా.. హిందీ, మలయాళం భాషల్లో డబ్ చేశారు.