Tripura Assembly Elections: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ, కాంగ్రెస్ ..

ఫిబ్రవరి 16న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమతమ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. బీజేపీ తొలి విడతలో 48 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 17 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Tripura Assembly Elections: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ, కాంగ్రెస్ ..

Tripura Election

Tripura Assembly Elections: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అభ్యర్థుల ఎంపికలో ఆచూతూచి అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకుగాను 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల వివరాలను బీజేపీ సీనియర్ నేతలు అనిల్ బలూనీ, సంబిత్ పాత్రాలు ప్రకటించారు. మిగిలిన 12 అసెంబ్లీ స్థానాలకు సోమవారం అభ్యర్థులను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైన మరునాడే త్రిపుర అభ్యర్థుల జాబితా విడుదల కావటం గమనార్హం.

 

బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో ధన్‌పూర్ నుంచి ప్రతిమా భూమిక్‌ను రంగంలోకి దింపారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రతిమ భూమిక్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. సీఎం మాణిక్ సాహా మరోసారి టౌన్ బోర్దోవలి నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ భట్టాచార్జీ బనమాలిపుర్ నుంచి పోటీ చేయనున్నారు. త్రిపుర వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉండేది. 25ఏళ్లపాటు సీపీఐ(ఎం) రాష్ట్రాన్ని పాలించింది. 2018 ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

 

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకూడా 17మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. సుదీప్ రాయ్‌ బర్మన్ అగర్తల నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఈసారి త్రిపురలో సీపీఎం, కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలాఉంటే త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 2న కౌంటింగ్ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 21న ప్రారంభమైంది.  జనవరి 30న ముగుస్తుంది.