కమల వికాసం: గ్రేటర్‌లో బలపడిన బీజేపీ

  • Published By: sreehari ,Published On : December 5, 2020 / 06:44 AM IST
కమల వికాసం: గ్రేటర్‌లో బలపడిన బీజేపీ

GHMC elections 2020: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా, ఊహించని విధంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. సీట్లు, ఓట్ల సంఖ్యలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. టీఆర్ఎస్ 56స్థానాల్లో గెలిస్తే.. బీజేపీ 48డివిజన్లలో విజయం సాధించింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో 34 లక్షల 73వేల ఓట్లు పోలయ్యాయి. 56 డివిజన్లలో గెలిచిన టీఆర్ఎస్‌.. 74 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అటు బీజేపీ 48 డివిజన్లలో గెలిచి..72 చోట్ల రెండో స్థానంతో సరిపెట్టుకుంది.


మజ్లిస్‌ విషయానికి వస్తే.. 44 డివిజన్లలో గెలిచి… ఒక చోట మాత్రమే రెండో స్థానంలో.. మిగతా అన్నిచోట్ల మూడోస్థానంలో ఉంది. కాంగ్రెస్‌ మాత్రం కేవలం 2 డివిజన్లలో గెలిచి.. మరో రెండు చోట్ల రెండో స్థానానికి పరిమితమైంది. అయితే.. టీఆర్‌ఎస్‌ కన్నా 7 డివిజన్లు తక్కువగా గెలుచుకున్నప్పటికీ.. మొత్తం ఓట్ల సంఖ్యా పరంగా చూస్తే బీజేపీకి కేవలం 0.25శాతం ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి. టీఆర్‌ఎస్‌ సీట్ల పరంగా గ్రేటర్‌లో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా.. ఓట్ల విషయంలో మత్రం బీజేపీ గట్టి ఫైట్ ఇచ్చింది.

ఈ రెండు పార్టీల ఓట్ల మధ్య తేడా కేలవం 8వేల 456 మాత్రమే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన ఫలితాల ప్రకారం.. మొత్తం పోలైన ఓట్లలో టీఆర్ఎస్‌కు 35.81శాతం, బీజేపీకి 35.56శాతం వచ్చాయి. రెండింటి మధ్య వ్యత్యాసం కేవలం 0.25శాతం మాత్రమే. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 43.85శాతం ఓట్లు సాధిస్తే.. ఈ ఎన్నికల్లో 35.81శాతానికి పడిపోయింది. 8శాతం ఓట్ షేర్‌ను గులాబీదళం కోల్పోయింది.



ఓట్ల పరంగా చూస్తే టీఆర్ఎస్ ఓట్లలో తగ్గుదల 2లక్షల 64వేల 451గా ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, కలిసి బరిలో నిలవగా అప్పట్లో బీజేపీ అభ్యర్థులు 65చోట్ల పోటీ చేసి 10.34శాతం ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 149 డివిజన్లలో పోటీ చేసింది. 35.56శాతం ఓట్లు సంపాదించింది. పాతబస్తీలో పట్టున్న ఎంఐఎం ఓట్ల శాతం పెంచుకుంది. గత ఎన్నికల్లో 15.85శాతం సాధించగా.. ఇప్పుడు 18.76శాతానికి పెరిగింది. కేవలం 6.67శాతం ఓట్లతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది.



చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ను బీజేపీ దెబ్బకొట్టింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అత్యధికంగా ఓట్లు, డివిజన్ లు సొంతం చేసుకుంది. నియోజకవర్గ పరిధిలో బీజేపీ లక్షా 29వేల ఓట్లు సాధిస్తే టీఆర్ఎస్ 86వేలకు పరిమితమైంది. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో బీజేపీ ఆధిక్యం కొనసాగింది. బీజేపీ 25వేల 121ఓట్లు పొందితే.. టీఆర్ఎస్ 17వేల 873కే పరిమితమైంది. యాకుత్ పురా నియోజకవర్గ పరిధిలో ఎంఐఎం ఎక్కువ ఓట్లు పొందినా అక్కడ టీఆర్ఎస్ కన్నా బీజేపీ సాధించిన ఓట్లే ఎక్కువ. ముషీరాబాద్, గోషామహల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోనూ బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది.