Ram Shankar Katheria: బీజేపీ ఎంపీ రామ్‌శంకర్ కతేరియాకు 2 ఏళ్ల జైలు శిక్ష.. ఏం జరిగిందంటే?
2011లో జరిగిన దాడి కేసులో ఆగ్రా కోర్టు శనివారం ఆయనకు ఈ శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 147 (అల్లర్లు సృష్టించడం), 323 (ఇతరుల్ని గాయపరచడం) కింద ఆయన దోషిగా తేలారు

Ram Shankar Katheria Jail Term: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ రామ్‌శంకర్ కతేరియా రెండేళ్లపాటు జైలు శిక్ష పడింది. 2011లో జరిగిన దాడి కేసులో ఆగ్రా కోర్టు శనివారం ఆయనకు ఈ శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 147 (అల్లర్లు సృష్టించడం), 323 (ఇతరుల్ని గాయపరచడం) కింద ఆయన దోషిగా తేలారు. శిక్ష విధించిన అనంతరం ఎంపీ కతేరియా మాట్లాడుతూ.. ‘‘నేను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యాను. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. కోర్టును గౌరవిస్తాను. అయితే అప్పీలు చేసుకునే హక్కు నాకు ఉంది. పైకోర్టుకు వెళ్తాను’’ అని అన్నారు.
Karnataka: అస్వస్థతకు గురైన 2వ తరగతి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి దుశ్చర్యకు పాల్పడ్డ ప్రిన్సిపాల్
కోర్టు తీర్పుతో ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధి ఏదైనా నేరానికి రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించబడిన వెంటనే ఆ ప్రజాప్రతినిధి అనర్హతను ఎదుర్కొంటారు. కతేరియాకు ఏదైనా కోర్టు నుంచి స్టే వచ్చినా లేదా ఆయన శిక్షపై స్టే వచ్చినా సభ్యత్వం చెక్కుచెదరకుండా ఉంటుంది.
రామ్ శంకర్ కతేరియా ఎవరు?
రామ్ శంకర్ కతేరియా నవంబర్ 2014 నుంచి జూలై 2016 వరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. కతేరియా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ఛైర్మన్‌గా కూడా పని చేస్తున్నారు. ఆయన రక్షణ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు.
నాలుగేళ్ల క్రితం టోల్ ప్లాజాపై దాడి జరిగినట్లు ఆరోపణలు
2019లో ఆగ్రాలోని టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి సంబంధించిన కేసులో కతేరియాపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే గార్డులు టోల్ ప్లాజా సిబ్బందిని కొట్టి గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ దాడి దృశ్యాలు టోల్‌ప్లాజాలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే టోల్ ప్లాజా ఉద్యోగులే తన సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని బీజేపీ నేత ఆరోపించారు.