10Th class exams రద్దు చేస్తారా ? సీఎం కేసీఆర్ కీలక భేటీ

  • Published By: madhu ,Published On : June 8, 2020 / 12:53 AM IST
10Th class exams రద్దు చేస్తారా ? సీఎం కేసీఆర్ కీలక భేటీ

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు నిర్వహిస్తారా.. లేదా అన్న దానిపై సస్పెన్స్‌ వీడడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పదో తరగతి పరీక్షలపై సోమవారం కీలక భేటీ నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ అధికారులతో ఆయన భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

పది పరీక్షలు నిర్వహించాలా… వద్దా..  లేక గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలా అనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితిలో టెన్త్‌ ఎగ్జామ్స్‌ రద్దుకే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే… కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాముంది. దీంతో పదో తరగతి పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గుచూపనున్నట్టు తెలుస్తోంది. విద్యాశాఖ అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పరీక్షలను రద్దు చేసి అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

వాస్తవానికి శనివారం జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లా మినహా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అదే సమయంలో పరీక్షలు నిర్వహిస్తోన్న ప్రాంతాల్లో కొత్త కరోనా కేసులు నమోదైతే పరీక్షా కేంద్రాలను మార్చాలని కూడా ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై రాష్ట్ర విద్యాశాఖ సుదీర్ఘంగా చర్చించింది.

జీహెచ్‌ఎంసీ మినహా పది పరీక్షలు నిర్వహిస్తే సాంకేతికంగా అనేక ఇబ్బందులతోపాటు.. విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సూచించింది. దీంతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. టెన్త్‌ ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలా.. పూర్తిగా రద్దు చేయాలా అన్నదానిపై సర్కార్‌ నిర్ణయం తీసుకోనుంది. 

Read: రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ ఓపెన్..ఈ నిబంధనలు పాటించాలి