CM KCR : యాదాద్రి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. 125 కేజీల బంగారంతో తాపడం

125 కేజీల బంగారంతో తిరుమల తరహాలో... యాదాద్రి గర్భగుడికి బంగారు తాపడం కూడా చేయిస్తామన్నారు సీఎం కేసీఆర్.

CM KCR : యాదాద్రి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. 125 కేజీల బంగారంతో తాపడం

Cm Yadadri

CM KCR : యాదాద్రి లక్ష్మీ నారసింహుడి క్షేత్రంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా పర్యటించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను రోజంతా దగ్గరుండి పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆలయంలోని ప్రధాన ఆలయం, ప్రెసిడెన్సీ సూట్లు, వీఐపీ గెస్ట్ హౌజ్ లు, ధర్మగుండం, పార్కులు, రోడ్లు… మండపాలు… లడ్డూ తయారీ కేంద్రం… అన్నదాన సత్రం…. మొక్కులు చెల్లించే ప్రాంతంలో వసతులు.. ఇలా.. అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి.. సౌకర్యాలను పరిశీలించారు.

ఆలయ పునఃప్రారంభ ముహూర్త పత్రికను సీఎం కేసీఆర్ టెంపుల్ ఈవోకు అందజేశారు. ముహూర్త పత్రికను లక్ష్మీ నారసింహుడి పాదాల వద్ద పెట్టాలని ఈవోకు సూచించారు. చిన్నజీయర్ స్వామి చేతి రాతతో ఈ ముహూర్త పత్రిక ప్రతిని సీఎం కేసీఆర్ కు ఇటీవలే అందజేశారు.

ఆలయాన్ని మళ్లీ ప్రారంభిస్తున్న సందర్భంగా 10వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. చిన్నజీయర్ స్వామి సుదర్శన హోమాన్ని పర్యవేక్షించనున్నారు. లక్ష 50వేల కేజీల కల్తీ లేని నెయ్యిని ఉపయోగిస్తామన్నారు సీఎం. పూజారులు, టెంపుల్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు.

సాయంత్రం ఏడుగంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడారు సీఎం కేసీఆర్. ఆలయ అభివృద్ధిని, రాబోయే రోజుల్లో టెంపుల్ సిటీతో వచ్చే మార్పును వివరించారు. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో ఆలయ ప్రారంభోత్సవం, సుదర్శన యాగం ఘనంగా, సంప్రదాయపద్ధతిలో నిర్వహిస్తామన్నారు సీఎం. యాదాద్రితో పాటు… హైదరాబాద్ ముచ్చింతల్ లో సమతా మూర్తి రామానుజ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనతో.. తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రం భాసిల్లబోతోందని సీఎం చెప్పారు.

మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణ
వచ్చే ఏడాది మార్చి 28 నాడు యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ జరుగుతుందన్నారు సీఎం కేసీఆర్. మార్చి 21 నాడు ఆలయ అంకురార్పణతో మహా సుదర్శన యాగం  మొదలవుతుందని చెప్పారు. 9 రోజుల పాటు అంకురార్పణ, మహా సుదర్శన యాగం, మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో తెలుగు రాష్ట్రాలే కాకుండా.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వందలాది వైష్ణవాలయ పూజారులు పాల్గొంటారన్నారు. ఈ ప్రాసెస్ అంతా అయ్యేందుకు కనీసం 2,3 నెలల టైం పట్టొచ్చన్నారు. సంక్రాంతికి ముందు దక్షిణాయణ కాలం కాబట్టి.. ఆ తర్వాత ఉత్తరాయణంలోనే కుదిరిన సమయంలోనే సుదర్శన యాగం నిర్వహిస్తామన్నారు సీఎం. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తారని.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం.

యాదాద్రి గర్భగుడి గోపురానికి బంగారు తాపడం
125 కేజీల బంగారంతో తిరుమల తరహాలో… యాదాద్రి గర్భగుడికి బంగారు తాపడం కూడా చేయిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఇందుకు రూ.60 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఖర్చు జరగొచ్చని చెప్పారు. ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంనుంచి… జనం తోచినంత సహకారం దీనికి అందించవచ్చన్నారు. పేదవాళ్లైతే రూ.11 అయినా కూడా ఇచ్చి… దేవుని గుడి నిర్మాణంలో తమ వంతుగా ప్రత్యక్షంగా పాల్గొనవచ్చని చెప్పారు. తన కుటుంబం నుంచి ఒక కేజీ 16 తులాల బంగారాన్ని విరాళం గా ఇస్తున్నట్టు తెలిపారు. కేజీల లెక్కన బంగారం ఇచ్చేందుకు ముందుకొచ్చిన నేతలు, సంస్థలను కేసీఆర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. చిన్నజీయర్ స్వామి కేజీ బంగారం ఇస్తామని చెప్పారన్నారు.