Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ సీఎం నితీష్.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? కాంగ్రెసేతర విపక్షాలు ఈ వ్యూహంపై కసరత్తు చేస్తున్నాయా?

Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ సీఎం నితీష్.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం!

Nithish Kumar

Presidential Candidate: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? కాంగ్రెసేతర విపక్షాలు ఈ వ్యూహంపై కసరత్తు చేస్తున్నాయా? అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇటీవల థర్డ్ ఫ్రంట్ ఆలోచనల్లో ఉన్న ఓ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. పీకే కూడా ఉన్నారని చెబుతున్నారు.

ఇటీవల నితీష్ కుమార్ ప్రశాంత్ కిశోర్‌తో ఢిల్లీలో రహస్యంగా భేటి అయ్యారు. అయితే, అంతుకుముందే నితీష్ కుమార్‌ను రాష్ట్రపతిని చేయాలనే చర్చను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద ప్రశాంత్ కిశోర్ ప్రస్తావించారంట. తెలంగాణా ఎన్నికల్లో పీకే టీమ్ ఈసారి కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ కోసం పని చేస్తుంది. అంతకుముందు ప్రశాంత్ కిశోర్ జగన్ కోసం, స్టాలిన్ కోసం కూడా పనిచేశారు. ఇక మమతా బెనర్జీ కూడా ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పనిచేశారు.

అయితే, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసలు వ్యూహం వెలుగులోకి రానుంది. ఎందుకంటే, బీజేపీకి ప్రస్తుతానికైతే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరినైనా పెట్టుకుని గెలిపించుకునే అవకాశం ఉంది కానీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత బీజేపీ అసలైన వ్యూహం బయటకు వస్తుంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమా?
ఇప్పటివరకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమా? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. కానీ, బీహార్‌లో నితీష్‌ పార్టీ, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఉండగా.. కుల గణన విషయంలో మాత్రం జేడీయూ, బీజేపీ మధ్య పోరు కొనసాగుతోంది. ఈ విషయంలో ఆర్జేడీ నితీష్‌కు అండగా ఉండగా.. తేజస్వి యాదవ్, కేసీఆర్ మధ్య కూడా ఇటీవల ఓ భేటీ జరిగింది. ఈ భేటీలోనూ రాష్ట్రపతి ఎన్నికపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయొచ్చనే అంటున్నారు.

థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటుకు మరో ప్రయత్నమేనా..?
బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసే మరో ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినది. ఈ గేమ్‌లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు కూడా చేరవచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని నిలబెడితే మాత్రం కాంగ్రెస్ కూడా కచ్చితంగా సపోర్ట్ చేయవచ్చు.

మొత్తంగా చూసుకుంటే, 8 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ, ప్రతిపక్ష పార్టీలు ఈ ఆలోచనకు సపోర్ట్ చేయవచ్చు అంటున్నారు. చూడాలిమరి ఎవరి వ్యూహం ఏమిటో?