Corona Second Wave: పాడు వైరస్ మళ్ళా వచ్చె.. పెళ్లిళ్లు ఎట్లా జెయ్యాలె!

పెళ్ళికి పెళ్లి కుమారుడు, కుమార్తె సిద్ధం. అంగరంగ వైభవంగా వివాహా వేడుక జరిపించి తమ స్థాయిని చాటుకోవాలనుకొనే తల్లిదండ్రులు సిద్ధం. తమ పిల్లలకి పెళ్లి చేస్తే ఒక బాధ్యత పూర్తవుతుందని ఆరాటపడే తల్లిదండ్రులూ మేము రెడీ అంటున్నారు. కానీ మాయదారి మహమ్మారి మళ్ళీ వచ్చేసింది.

Corona Second Wave: పాడు వైరస్ మళ్ళా వచ్చె.. పెళ్లిళ్లు ఎట్లా జెయ్యాలె!

Corona Second Wave2

Corona Second Wave: పెళ్ళికి పెళ్లి కుమారుడు, కుమార్తె సిద్ధం. అంగరంగ వైభవంగా వివాహా వేడుక జరిపించి తమ స్థాయిని చాటుకోవాలనుకొనే తల్లిదండ్రులు సిద్ధం. తమ పిల్లలకి పెళ్లి చేస్తే ఒక బాధ్యత పూర్తవుతుందని ఆరాటపడే తల్లిదండ్రులూ మేము రెడీ అంటున్నారు. కానీ మాయదారి మహమ్మారి మళ్ళీ వచ్చేసింది. గత ఏడాది కరోనా మొదటి దశ. ఏడాది చివర నుండి పెళ్లిళ్లకు మంచి ముహూర్తాల్లేవు. మధ్య మధ్యలో అరకొర ముహుర్తాలున్నా అవేవీ మూడుముళ్లు వేసే ముహుర్తాలు కాదు. ఆ అరకొర ముహూర్తాల్లోనే నిశ్చతార్ధాలు చేసుకొనే వాళ్ళు ఆ తంతు చేసుకొని పెళ్లి కోసం పంచాంగాలు తిరగేస్తున్నారు. .

అసలే ఈ ఏడాది మాఘమాసం అంతా మూఢంలో పోయింది. మే నెల మొదటి వారంతో మూఢం పోయి ముహుర్తాలు మొదలవుతాయి. మేలో వైశాఖ మాసం ప్రారంభమైనప్పటి నుంచి జులై 8న జ్యేష్ఠమాసం ముగిసేవరకూ పెళ్లి ముహూర్తాలున్నాయి. మళ్ళీ జులై 9 నుంచి ఆషాఢమాసం వస్తుందట. మే నుంచి జులై మధ్య కాలంలో నిండా ఆ యాభై రోజులే పెళ్లిళ్లకు మంచి ముహూర్తం అనమాట. ఈ సమయంలోనే ఆ పెళ్లి తంతేదో పూర్తి చేసుకోవాలని అటు తల్లి దండ్రులు, ఇటు వధూవరులు తెగ ఆరాటపడుతున్నారు.

గత ఏడాది నుండి ఉన్న ముహూర్తాలను నాశనం చేసిన మూఢం దెబ్బకు అందరూ మే నెలలో ముహూర్తాలకు ఫిక్స్ అయ్యారు. మే నెల ముహూర్తాలలో అందరూ ఆరాటపడితే అప్పుడు ఇబ్బందులు రాకుండా ఉంటాయని ముందుగానే ఫంక్షన్ హాల్స్, భాజాభజంత్రీలు, ఫోటోగ్రాఫర్లు, పూలు, మండపాలు, క్యాటరింగ్ అన్నీ మాట్లేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏప్రిల్ నెల నాటికి మహమ్మారి ముంచుకొచ్చింది. ఆసుపత్రులూ, స్మశానాలు పట్టనంత బిజీ అయిపొయింది. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. దీంతో ఇప్పుడు పెళ్లిళ్లు ఎట్లా చేసుకోవాలని డైలమా వచ్చేసింది.

అన్నీ కుదిరాయి.. అక్షింతలు వేయటమే తరువాయి అనుకున్న సమయంలో కాబోయే దంపతులకు, వారి తల్లిదండ్రులకు కరోనా తీవ్ర నిరాశను మిగుల్చుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో 1, 3, 7, 12, 13, 14 తేదీల్లో సుమారు 2 లక్షల నుంచి 2.5 లక్షల వివాహ వేడుకలు జరగాల్సి ఉన్నట్లు అంచనా. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే ధైర్యంతో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖతో పాటు కొన్ని పట్టణాలలో కూడా కొందరు పెళ్లితంతు బాధ్యతలను ఈవెంట్‌ నిర్వాహక సంస్థలకు అప్పగించి అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు.

అంతా సజావుగానే ఉందని భావిస్తున్న సమయంలో కరోనా రెండో దశ విజృంభించింది. దీంతో ఇప్పుడు ఈ పెళ్లిళ్ల పరిస్థితి ఏంటన్నది అర్ధంకాని పరిస్థితి. ఏర్పాట్లు ముఖ్యం కాదు తమ బిడ్డల జీవితాలే ముఖ్యమనుకొనే కొందరు అతికొద్దిమందితో ముహూర్తానికి మూడుముళ్లు వేయించాలని భావిస్తుంటే.. అన్నీ సర్దుకున్నాకే ఒక్కటవుతాంలే మీరు టెన్షన్ పడొద్దని కొందరు యువతీ, యువకులే పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది కూడా ఇదే సమయంలో పెళ్లిళ్ల కోసం ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ సంస్థలకు ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలని భారీ స్థాయిలో రాద్ధాంతాలు జరగగా పలుచోట్ల పోలీసులే పంచాయతీలు సెటిల్ చేశారు. సరిగ్గా ఈ ఏడాది మళ్ళీ అదే సమయానికి మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. మరి ఈ ఏడాది ఈ కష్టాల నుండి ఎలా గట్టెక్కుతారో ఏమో!