విజయవాడ టీడీపీలో భగ్గుమన్న విబేధాలు.. ఎంపీ కేశినేని నానిని అడ్డుకున్న కార్యకర్తలు

విజయవాడ టీడీపీలో భగ్గుమన్న విబేధాలు.. ఎంపీ కేశినేని నానిని అడ్డుకున్న కార్యకర్తలు

differences in vijayawada tdp: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీలో విబేధాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. వన్ టౌన్ నాలుగు స్తంభాల సెంటర్ లో డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ నానిని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఒకే వార్డులో పార్టీకి సంబంధించిన రెండు కార్యాలయాలు ఎలా ఉంటాయని ఎంపీని బుద్దా వెంకన్న వర్గీయులు ప్రశ్నించారు. అంతేకాదు, పార్టీ మారిన వాళ్ళని టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారని నిలదీశారు. కనీసం పార్టీ కండువా కూడా కప్పుకోలేదని.. అలాంటి వారి తరపున ఎలా ప్రచారం చేస్తారో చెప్పాలన్నారు. ఒకే చోట ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్ధులను ఎలా పెడతారని అడిగారు.

టీడీపీ కార్యకర్తల్ని ఎంపీ నాని వారించే ప్రయత్నం చేశారు. తాను తప్పు చేస్తే పార్టీ క్రమ శిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ నుంచి తెచ్చుకున్నారని.. వాళ్లలో కొంతమంది గతంలో తిట్టినవారే కదా అన్నారు.. అది తప్పు కాదా అంటూ ప్రశ్నించారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా వారిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చని.. ఇలా నడి రోడ్డుపై అడ్డుకొని వాగ్వాదం చేస్తే పార్టీకే నష్టం అన్నారు.

ఇదిలా ఉంటే మేయర్ అభ్యర్థి విషయంలో టీడీపీలో వార్ మొదలైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధులతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సీనియర్ నేనేత నాగుల్‌మీరా సమావేశం అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మేయర్‌ అభ్యర్థ విషయంలోనూ గందరగోళం కొనసాగుతోంది. చంద్రబాబు ఇంకా ఎవరి పేరు ఫైనల్ చేయలేదు.‌ గత కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థికి ఇచ్చారని.. ఈసారి సెంట్రల్ నియోజకవర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్నారట.

ఇటు కేశినేని నాని కుమార్తె శ్వేత మేయర్ అభ్యర్థి అని ప్రచారం జరుగుతుండగా.. ఇంకా ఎవరి పేరు డిక్లేర్ చేయలేదని వ్యతిరేక వర్గం అంటోంది. చంద్రబాబు ఎవరు మేయర్‌ అని చెబితే వారికే మద్దతిస్తామని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు అంటున్నారు. ఇటు బుద్దా వెంకన్న వర్గం కూడా కేశినేని నానిపై అసహనంతో ఉంది.