Elephants rescued: కాలువలో చిక్కుకున్న ఏనుగుల గుంపు

కాలువలో చిక్కుకుని, బయటకు రాలేకపోతున్న ఏనుగులను అటవీశాఖ అధికారులు రక్షించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Elephants rescued: కాలువలో చిక్కుకున్న ఏనుగుల గుంపు

Elephants

Elephants rescued: కాలువలో చిక్కుకుని, బయటకు రాలేకపోతున్న ఏనుగులను అటవీశాఖ అధికారులు రక్షించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది. మైసూరు జిల్లా గురుపుర గ్రామంలో గత కొన్ని రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తుంది. స్థానికంగా పంట పొలాలను నాశనం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. జనవరి 10న గురుపుర గ్రామంలోని ఒక రైతు పొలంలో ఏనుగులను గమనించిన స్థానికులు వాటిని స్థానిక అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఏనుగుల గుంపును గ్రామస్తులు తరుముతుండగా.. హనగోడు గ్రామ సమీపంలోని లక్ష్మణ తీర్థ నదీ కాలువలోకి జారిపడ్డాయి.

Also read: Employee Fitment: ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న సిపిఐ నేత

అనంతరం కాలువ నుంచి బయటకు వచ్చేందుకు ఏనుగులు ప్రయత్నించగా..కట్టపై పట్టులేక జారిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు స్థానిక అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఆ ఏనుగులను సురక్షితంగా బయటకు తీసి సమీపంలోని నాగరహోళే టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో వదిలారు. ఇక ఏనుగులు కాలువలో నుంచి ఒడ్డుకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు యువకులు ఆ దృశ్యాన్ని వీడియో తీశారు.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మనుషులు నిర్మించుకున్న మౌలికసదుపాయాలు ఏనుగులకు అగ్నిపరీక్షలా మారిందని సుశాంత్ నందా ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం వన్యప్రాణులు సంచరించే ఇటువంటి ప్రాంతాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Also read: Bill Gates: ఓమిక్రాన్ రోగనిరోధక శక్తిని పెంచుతుందన్న బిల్ గేట్స్