Delhi Border : ఖాళీ అవుతున్న సరిహద్దులు…సొంతూళ్ళకు వెళుతున్న రైతన్నలు

సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించడంతో ఉద్యమం ఆగుతుందని భావించారు...

Delhi Border : ఖాళీ అవుతున్న సరిహద్దులు…సొంతూళ్ళకు వెళుతున్న రైతన్నలు

Farmers Protest

Farmers Vacate Delhi : ఢిల్లీ సరిహద్దులు ఖాళీ అవుతున్నాయి..! 380రోజులుగా ఉంటున్న టెంట్లను తొలగిస్తున్నారు రైతులు. కాసేపట్లో సింఘీ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతుల విజయోత్సవ ర్యాలీలు చేయనున్నారు. వ్యవసాయ చట్టాలను తుద ముట్టించిన విజయోత్సాహంతో అడుగులు ముందుకేస్తున్నారు. విజయ కవాతుతో స్వస్థలాలకు వెళుతున్నారు రైతన్నలు. రైతు డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో ఆందోళన విరమించారు రైతులు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా 15 నెలలకుపైగా ఉద్యమం చేస్తున్న రైతులు ఎట్టకేలకు తమ పోరును ముగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను, విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ 2020 నవంబరు 26న ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభించిన అన్నదాతల ఆందోళనలు ఫలించాయి.

Read More : Papagni River Bridge : పాపాఘ్ని నదిపై నడక దారికి ఏర్పాట్లు

ఈ మహోజ్వల ఉద్యమాన్ని ధీరోచితంగా సాగించారు అన్నదాతలు. దేశానికి వెన్నెముకైన రైతాంగం, వ్యవసాయ కార్మికులు సమరశంఖారావం పూరించిన రోజు నుంచీ ఇవాళ్టి వరకు రైతుల పోరాటం నిర్విరామంగా కొనసాగింది. కష్టజీవుల ఐక్యతను చాటింది. క్రమశిక్షణతో అత్యంత ప్రజాస్వామ్యయుత పద్ధతుల్లో హింసకు ఏమాత్రం తావు ఇవ్వకుండా ఈ ఉద్యమం సాగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 పైగా రైతు సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చాపేరిట ఒకే గొడుగు కిందకు రావడం అసాధారణమైన విషయం. ఈ ఉద్యమంలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఢిల్లీ ఉద్యమంలోనూ వారు తమ శక్తిని చాటారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పోరు బాటలో నడిచారు. ఉద్యమ బలోపేతానికి బీజాలు నాటిన మరో విశేషమైన లక్షణం ఈ పోరాటం ఆసాంతం లౌకికవాద పద్ధతుల్లో సాగడం.

Read More : Jawan Sai Teja : ఆదివారం సాయితేజ అంత్యక్రియలు

ఇక సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించడంతో ఉద్యమం ఆగుతుందని భావించారు. అయితే, తమ మిగిలిన డిమాండ్లను కూడా నెరవేరిస్తే తప్ప ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు భీష్మించుకున్నారు. సాగు నీటిచట్టాల రద్దుకు సంబంధించిన బిల్లులను పార్లమెంటు ఆమోదించిన తర్వాత కూడా మిగిలిన డిమాండ్ల కోసం రైతులు ఆందోళన సాగించారు. ఈ ఆందోళన సందర్భంగా మరణించిన 700మంది పైగా రైతుల కుటుంబాలకు పరిహారాన్ని ఇవ్వాలని కిసాన్‌ మోర్చా పట్టుపట్టింది. దీంతో మరింత దిగొచ్చిన కేంద్రం మిగిలిన డిమాండ్లను కూడా ఆమోదిస్తున్నట్టు ప్రతిపాదనలు పంపింది. ఇక రైతుల డిమాండ్లపై కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి.

Read More : Nayanathara : కొత్త బిజినెస్ ప్రారంభించిన నయన్.. ఇక అమ్మాయిలంతా ఇవే ప్రొడక్ట్స్

పంజాబ్‌ ప్రభుత్వం కూడా మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.. ఉద్యమం సందర్భంగా రైతులపై మోపిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని కూడా కేంద్రం హామీ ఇచ్చింది. ఇక ప్రతిపాదనాలు పరిశీలించిన కిసాన్‌ మోర్చా తమ ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేయాలని జనవరి 15వ తేదీన మళ్లీ సమావేశమై, ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఏ మేరకు ఆమోదించిందీ సమీక్షించిన తర్వాత భవిష్యత్‌ కార్యక్రమాన్ని ప్రకటించాలని నిర్ణయించింది. ఎండనక, వాననక రైతులు ఆ శిబిరాలో తలదాచుకుంటూ.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమాన్ని సాగించిన రైతులు ఇప్పుడు సొంతూళ్లకు పయనమవుతున్నారు.