Dayakar Reddy Passed away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు.

Dayakar Reddy Passed away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత

Kothakota Dayakar Reddy

Updated On : June 13, 2023 / 7:17 AM IST

Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం గ్రామం. దయాకర్ రెడ్డి మూడు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994, 1999లో అమరచింత నియోజకవర్గం నుండి  రెండు సార్లు, నియోజకవర్గాల పున:విభజన తరువాత  2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంకు కృషిచేసిన వారిలో దయాకర్ రెడ్డి ఒకరు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ దయాకర్ రెడ్డి పనిచేశారు.

 

దయాకర్ రెడ్డి, ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డికి టీడీపీతో ప్రత్యేక అనుబంధం ఉంది. వారి రాజకీయ జీవితం టీడీపీలోనే సుదీర్ఘకాలం కొనసాగింది. సీతా దయాకర్ రెడ్డికూడా భర్తకు తోడుగా రాజకీయాల్లో కొనసాగారు. ఆమె 2002 సంవత్సరంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2009 సంవత్సరంలో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తరువాతకూడా వీరు కొద్దికాలం టీడీపీలో కొనసాగారు. గతేడాది ఆగస్టు నెలలో దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో వారు కన్నీరు పెట్టుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

 

ఆ తరువాత కొద్దికాలంకు దయాకర్ రెడ్డి అనారోగ్యంకు గురికావటంతో దంపతులిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటూవచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న దయాకర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకొని స్వగ్రామం పర్కపురంకు వచ్చారు. మళ్లీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.