Gaddar in movies : పొడుస్తున్న పొద్దులా.. తెలుగు సినిమా తెరపై చిరస్మరణీయం గద్దర్ పాట

ఉద్యమ స్ఫూర్తి రగిలించినా.. రైతు కష్టాలు వివరించినా, అమ్మ పాటతో లాలించినా గద్దర్‌కే చెల్లింది. గద్దర్ భౌతికంగా మాత్రమే లేరు. ఆయన రాసిన , పాడిన పాటల్లో సజీవంగా నిలిచారు. చరిత్రలో నిలిచిపోయారు.

Gaddar in movies : పొడుస్తున్న పొద్దులా.. తెలుగు సినిమా తెరపై చిరస్మరణీయం గద్దర్ పాట

Gaddar in movies

Updated On : August 7, 2023 / 10:49 AM IST

Gaddar in movies : ఆయన పాడుతుంటే జనంలో ఊపు వచ్చేసింది. రోమాలు నిక్కపొడుస్తాయి. కమ్మనైన అమ్మ పాటైనా.. దుక్కి దున్నే రైతు పాటైనా.. ఉద్యమానికి ఊపిరి పోసే పాటైనా ఆయన పదాలు పరుగులు పెడతాయి. గుండెలు తడతాయి. ప్రజల గుండెల్లో ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్న గొప్ప విప్లవ కవి, గాయకుడు, సామాజిక కార్యకర్త, తెలంగాణ ఉద్యమ నేత గద్దర్ అనారోగ్యంతో కన్నుమూసారు. గద్దర్‌కు తెలుగు సినిమా ఇండస్ట్రీతో గొప్ప అనుబంధం ఉంది. ఆయన రాసిన ఎన్నో పాటలు తెలుగు తెరపై వెలిగాయి.

Gaddar : ఆ పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగింది- గద్దర్ సంచలన వ్యాఖ్యలు

గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 1949 అక్టోబర్ 8 న జన్మించారు. శేషయ్య, లచ్చుమమ్మ ఆయన తల్లిదండ్రులు. గద్దర్ ‘మా భూమి’ సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో మొదటిసారి నటించారు. ఈ సినిమాలోని ‘బండెనక బండి కట్టి’ పాటను ఆయనే ఆడి పాడారు. 1985 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. జన నాట్య మండలిలో చేరి ఒగ్గుకథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. గోచీ ధోతి, గొంగళి ధరించి ఆయన పాడే పాటలకు జనం ఉర్రూతలూగేవారు. ఆయన పాటలు జనంలో చైతన్యం కలిగించేవి. పేదల కష్టాలు, బాధలను ఆయన తన బృందంతో కళ్లకు కట్టినట్లు పాటలు, నాటకాల రూపంలో ప్రదర్శించేవారు. ఆయన పాటల క్యాసెట్లు, సీడీలు రికార్డు స్ధాయిలో అమ్ముడుపోతుండేవి.

 

గద్దర్ 1971 లో మొదటి పాట ‘ఆపరా రిక్షా’ రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆ తరువాత ఆయన పేరుగా మారింది. ‘ఒరేయ్ రిక్షా’ సినిమాలో ఎంతో పాపులర్ అయిన పాట ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ పాట ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన పాట “పొడుస్తున్న పొద్దు మీద” పాట గద్దర్ రాశారు. జైబోలో తెలంగాణ సినిమా విడుదలైనపుడు ఈ పాటకు థియేటర్లు దద్దరిల్లాయి. ఈ పాటకు నంది అవార్డు కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రచించిన మరోపాట ‘అమ్మా తెలంగాణ ఆకలికేకల గానమా’ కూడా ఎంతో పాపులర్ అయ్యింది. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం విశేషం.

Gaddar-KA PAUL Munugode Bypoll : రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారిన గద్దర్, కేఏ పాల్ దోస్తీ ..

గద్దర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. గద్దర్ భౌతికంగా లేకపోయిన ఆయన రాసిన పాటలు వినిపిస్తూనే ఉంటాయి. జనంలో చైతన్యం కలిగిస్తూనే ఉంటాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన పాటలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.