PM Modi : పటేల్ జీవించి ఉంటే..గోవాకు ముందుగానే విముక్తి

: దేశపు మొదటి హోంమంత్రి సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ మరికొద్దికాలం జీవించి ఉండి ఉంటే పోర్చుగీసు పాలన నుంచి గోవాకు ముందే స్వాతంత్య్రం వచ్చి ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం

PM Modi : పటేల్ జీవించి ఉంటే..గోవాకు ముందుగానే విముక్తి

Modi8

Goa Liberation Day Celebrations : దేశపు మొదటి హోంమంత్రి సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ మరికొద్దికాలం జీవించి ఉండి ఉంటే పోర్చుగీసు పాలన నుంచి గోవాకు ముందే స్వాతంత్య్రం వచ్చి ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం పనాజీలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో నిర్వహించిన గోవా లిబరేషన్ డే(గోవా విముక్తి దినోత్సవం)సెలబ్రేషన్స్ లో పాల్గొన్న మోదీ… స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. నౌకాదళ, వైమానిక విన్యాసాలను వీక్షించారు. పోర్చుగీసు నుంచి గోవా విముక్తి కోసం జరిగిన ‘ఆపరేషన్‌ విజయ్‌’లో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట వీరులను సత్కరించారు. వారి సేవలను కొనియాడారు. పోర్చుగీసు నుంచి గోవా విముక్తి చెందిన 1961నుంచి ఏటా డిసెంబరు 19న గోవా విముక్తి దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా గోవాపై ప్ర‌శంస‌లు కురిపించారు ప్రధాని. గోవా రాష్ట్రానికి అన్ని అంశాల్లో అగ్ర‌స్థాన‌మేన‌న్నారు. సుప‌రిపాల‌న‌లో, త‌ల‌స‌రి ఆదాయంలో,ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ వసతి, ప్రతి ఇంటికీ నల్లా ఇంకా చాలా అంశాల్లో గోవాదే ముందంజ అని ప్ర‌శంసించారు. గోవాలో సింగిల్ డోస్ వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యింద‌ని ప్ర‌ధాని తెలిపారు. గోవాలో అర్హులైన వారిలో 100 శాతం మందికి తొలి డోస్ వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యింద‌ని చెప్పారు. అందుకు గోవా స‌ర్కారును అభినందించారు. గోవా అభివృద్ధి కోసం సీఎం ప్రమోద్ సావంత్​ శాయశక్తులా కృషిచేస్తున్నారని మోదీ అన్నారు.

కొన్ని శ‌తాబ్దాల క్రితం దేశంలోని ప్ర‌ధాన ప్రాంతాల‌న్నీ మొగ‌లుల పాల‌న‌లో ఉండ‌గా, గోవా మాత్రం పోర్చుగ‌ల్ పాల‌న‌లో ఉండేద‌ని ప్ర‌ధాని గుర్తుచేశారు. పోర్చుగల్‌ పాలనలో ఏళ్లపాటు మగ్గినా గోవా త‌న భారతీయ‌త‌ను మ‌రువ‌లేద‌ని, భార‌త దేశం కూడా గోవా త‌మ రాష్ట్ర‌మ‌నే సంగ‌తిని మ‌ర్చిపోలేద‌ని మోదీ వ్యాఖ్యానించారు. గోవా మాజీ ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ ప్ర‌వ‌ర్త‌న ద్వారా గోవా ప్ర‌జ‌లు ఎంత నిజాయితీప‌రులో, ప్ర‌తిభావంతులో, ఎలా క‌ష్ట‌ప‌డుతారో దేశం మొత్తం చూసింద‌ని ప్ర‌ధాని అన్నారు. గోవా అభివృద్ధిలో మాజీ సీఎం, దివంగత నేత మనోహర్​ పారికర్​ కృషి ఎంతగానో ఉందన్నారు. ఒక వ్య‌క్తి త‌న రాష్ట్రం కోసం, ప్ర‌జ‌ల కోసం త‌న ఆఖ‌రి శ్వాస వ‌ర‌కు పోరాడుతాడ‌నే విష‌యాన్ని మ‌నం మ‌నోహ‌ర్ పారిక‌ర్ జీవితం ద్వారా చూశామ‌ని చెప్పారు.

గోవా పర్యటనలో రూ.650 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను మోదీ ఆవిష్కరించారు. ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష స్కీమ్ కింద గోవా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో రూ.380 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ బ్లాక్, అధునాతన వైద్య సదుపాయాలతో రూ.220 కోట్లతో నిర్మించిన న్యూ సౌత్ గోవా డిస్ట్రిక్ హాస్పిటల్,స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద రూ.28 కోట్లతో హెరిటేజ్ టూరిజంగా పునరాభివృద్ధి చేసిన అగౌద ఫోర్ట్ మ్యూజియంను మోదీ ప్రారంభించారు. గోవాకి స్వాతంత్ర్యం రాక ముందు అగౌద ఫోర్ట్..స్వాతంత్ర్య సమరయోధులను బంధించి,వేధింపులకు గురి చేసేందుకు ఉపయోగించబడేది. ఇక,మోపా యిర్ పోర్ట్ వద్ద నిర్మించిన ఏవియేషన్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను కూడా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ కు మోదీ శంకుస్థాపన చేశారు.

ఇక,వచ్చే ఏడాది ప్రారంభంలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీకి ఆప్,టీఎంసీ పార్టీలు గట్టి సవాల్ విసురుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు పలు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను ఆకర్షిస్తూ తమ పార్టీల్లో చేర్చుకుంటున్నాయి టీఎంసీ,ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే,గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన విషయం తెలిసిందే.

ALSO READ RSS Chief : 40వేల ఏళ్లుగా భారతీయులందరి DNA ఒక్కటే!