Hyderabad Nims Hospital : ఎముకల ఆస్పత్రిగా మొదలైన నిమ్స్‌ .. నిజాం ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్ సైన్సెస్‌గా మారిన వెనుక ‘వారి’ కృషి

ఎముకల ఆస్పత్రిగా మొదలైన నిమ్స్‌ ప్రతిష్టాత్మక సంస్థగా ఎలా మారింది. దాని వెనుక ఎవరి కృషి ఉంది. వారి సంకల్పానికి నిస్వార్థ కృషికి కార్పొరేట్‌కి దీటుగా ఎలా నిలదొక్కుకుంటోంది? పేదోళ్ల ఆస్పత్రిగా ఎలా ప్రఖ్యాతి పొందింది? ఈనాటీకీ పేదలకు భరోసా ఇచ్చేలా ఎలా నిలిచింది?

Hyderabad Nims Hospital : ఎముకల ఆస్పత్రిగా మొదలైన నిమ్స్‌ .. నిజాం ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్ సైన్సెస్‌గా మారిన వెనుక ‘వారి’ కృషి

‘NIMS’ as a bone hospital and became the Nizam Institute of Sciences (2)

Hyderabad Nims Hospital : ఎముకల ఆస్పత్రిగా మొదలైన నిమ్స్‌ ప్రతిష్టాత్మక సంస్థగా ఎలా ఎదిగింది? నిమ్స్‌ నేటికీ ఎందుకంత ప్రత్యేకం? కార్పొరేట్‌కి దీటుగా ఎలా నిలదొక్కుకుంటోంది? పేదోళ్ల ఆస్పత్రిగా ఎలా ప్రఖ్యాతి పొందింది? అనే ప్రశ్నలకు సమాధానాలు అంత సులువేం కాదు. అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమూ ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పేదోళ్లకు నాణ్యమైన వైద్యం అందించాలనే తపన.. ప్రపంచంలోనే మేటి డాక్టర్లు.. అధునాతన పరిశోధనలు.. దశాబ్దాల శ్రమ.. కలగలిపి ఓ మహత్తర యజ్ఞంలా సాగితే అదే నిమ్స్‌.

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో 1964లో మొదలైన నిజాం ఎముకల ఆస్పత్రి.. ఆ తర్వాత నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా అభివృద్ది చెందింది. అతి తక్కువ ఖర్చుతో.. అత్యుత్తమ వైద్య సేవలకు.. నిమ్స్‌ను కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిపిన క్రెడిట్‌ అక్కడి వైద్యులదే. వైద్య సేవల్లోనే కాదు.. వైద్య పరిశోధనల్లోనూ ఎన్నో మైలురాళ్లు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చొరవతో.. అమెరికాలో హార్ట్ స్పెషలిస్ట్‌లలో ఒకరిగా పేరొందిన కాకర్ల సుబ్బారావు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం.. నిమ్స్‌ నూతన అధ్యాయానికి నాంది పలికింది. కొన్నేళ్ల పాటు కనీసం జీతం కూడా తీసుకోని కాకర్ల.. నిమ్స్‌ అభివృద్ధికి.. సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇక్కడి వైద్యులను భారత అత్యున్నత పద్మశ్రీ పురస్కారాలు కూడా వరించడం నిమ్స్‌ డాక్టర్ల ప్రతిభ.. వారి అంకిత భావానికి నిదర్శనం.

Hyderabad Nims Hospital : నిమ్స్ హాస్పిటల్ ఆధునీకరణకు రూ.1,571 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

వైద్య పరీక్షలకే రక్తం పీల్చే ఆస్పత్రులు తయారైన ఈ రోజుల్లోనూ.. అతి తక్కువ ఖర్చుకే కచ్చితమైన రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్యం అందించడం నిమ్స్‌ స్పెషాలిటీ. కోట్ల రూపాయలు విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలతో.. సాధారణ ధరలకే స్కానింగ్‌.. రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. కిడ్నీ.. కాలేయం.. గుండె.. క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక.. నయంకాని జబ్బులను సైతం గుర్తించి.. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అధునాతన చికిత్సలో కొత్తపుంతలు తొక్కుతోంది.

అటు రీసెర్చ్‌లోనూ నిమ్స్‌ సత్తా చాటుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో వస్తున్న మార్పులు.. తమ అనుభవాలతో గత 20 ఏళ్లుగా ప్రతి నెలా మెడికల్ జర్నల్‌ను కూడా నిమ్స్‌ ప్రచురిస్తోంది. క్రిటికల్‌ సిట్యుయేషన్‌.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే… ఎంతో అనుభవమున్న వైద్యులు నిమ్స్‌ వైద్యులను సలహా అడుగుతారంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు వైద్యులు అప్‌డేట్‌ అవుతుంటారు. దానికి తగినట్లుగా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు నిమ్స్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటీవలే కీమోథెరపీ కోసం అత్యాధునిక డే కేర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. చైర్‌లో కూర్చునే చికిత్స అందించే సాంకేతికతను తీసుకొచ్చారు. అది కూడా నామమాత్రపు ధరకే… ఇక ఎన్నో అరుదైన ఆపరేషన్లకు నిమ్స్‌ వేదికైంది.

అంత ఘనమైన చరిత్ర ఉన్నా….నిమ్స్‌ను కొన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా సరిహద్దు రాష్ట్రాల నుంచి వేలాదిగా రోగులు వస్తున్నా.. అందుకు తగినట్టుగా వసతులు మాత్రం లేవు. నిత్యం వేల సంఖ్యలో ఔట్‌ పేషెంట్లు నిమ్స్‌కి వస్తుంటారు. వందల సంఖ్యలో ఇన్‌పేషెంట్స్‌ చేరుతుంటారు. అత్యవసరంగా వైద్య సేవలు అందించాల్సిన ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు సరిపోక చాలా కాలంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి బయట అంబులెన్సుల్లోనే వెయిట్ చేయాల్సిన దుస్థితి. ఎమర్జెన్సీ వార్డు నుంచి డిశ్చార్జి చేసిన తర్వాత.. జనరల్ వార్డుకి రోగులు చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. రోగులు ఆ స్థితిలో ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. నర్సులు.. సహాయక సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. కొన్నిసార్లు రోగుల బంధువులు.. సిబ్బంది నడుమ గొడవలు కూడా జరిగిన సందర్బాలున్నాయి. ఎన్నో లక్షల మందికి ఉత్తమ వైద్య సేవలందిస్తూ ముందుకు సాగుతున్న నిమ్స్‌ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.