కాన్‌వే.. కాస్త లేటయ్యింది.. కోట్లు మిస్..

కాన్‌వే.. కాస్త లేటయ్యింది.. కోట్లు మిస్..

ప్రపంచంలో ఏ క్రికెటర్ అయినా కూడా ఐపీఎల్ ఆడాలని ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తాడు. ఐపీఎల్‌లో ఆడడమే గొప్ప విషయం అనుకుంటాడు. అయితే, ఐపీఎల్‌లో ఆడే అవకాశం అందరికీ రాదుగా.. ఐపీఎల్‌ వేలంలో పోటీలో ఉండాలంటే షార్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఆయా క్రికెటర్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. గొప్పగా ఆడేవాళ్లు.. చెత్తగా ఆడేవాళ్లు.. అనే లిస్ట్ ప్రకారం ఐపీఎల్‌లో జట్లు ప్లేయర్లను తీసుకుంటూ ఉంటాయి.

ఇటీవల చెన్నైలో ఐపీఎల్‌-2021 వేలం జరగగా.. అందులో చాలా మంది ఆటగాళ్లు కోట్ల రూపాయలు పలికారు.. అద్వితీయ ప్రదర్శన ఆధారంగా ఐపీఎల్‌లో కొత్తవారికి కూడా అవకాశం వస్తూ ఉంటుంది. కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పుడు ఐపీఎల్ వేలం నాలుగు రోజుల తర్వాత జరిగి ఉంటే మాత్రం ఒక ఆటగాడికి కచ్చితంగా కోట్లు ఇచ్చి కొనుక్కొనేవాళ్లు అని క్రికెట్ సర్కిళ్లలో వినిపిస్తోంది. న్యూజిలాండ్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ డేవాన్‌ కాన్‌వే, రోజుల వ్యవధిలో ఐపీఎల్‌ ఆడే అవకాశమే కాదు.. కోట్ల రూపాయల్ని సంపాదించే ఛాన్స్ మిస్సయ్యాడు.

ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ దేవన్ కాన్‌వే 59 బంతుల్లో 99 ప‌రుగులు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆర‌వ టీ20 మ్యాచ్ ఆడుతున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ కాన్‌వే సూప‌ర్ ఆట తీరు అధ్భుతంగా ఉండగా.. 19 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్‌కు భారీ స్కోర్‌ అందించాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో న్యూజిలాండ్ అయిదు వికెట్ల న‌ష్టానికి 184పరుగులు చెయ్యడంలో కీలక పాత్ర పోషించాడు. అటువంటి ఆటగాళ్లకు ఐపీఎల్‌లో మంచి ఛాన్స్ ఉంటుంది.

అయితే కాన్‌వే ఇన్నింగ్స్ కాస్త లేట్ అవ్వడంతో అతను ఐపీఎల్ మిస్ అయ్యాడు అని అందరూ అంటున్నారు. ఇది విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. ఇటీవల ముగిసిన వేలంలో కాన్‌వే కనీస ధర 50 లక్షల రూపాయలకు కూడా అమ్ముడు పోలేదు. ఆసీస్‌తో ఆడిన ఇన్నింగ్స్‌ ముందే వచ్చుంటే కచ్చితంగా అతనిని పోటీపడి జట్లు తీసుకునేవి.