పోలీసుల మానవత్వం.. కరోనా భయంతో కుటుంబసభ్యులు వదిలేసిన మృతదేహానికి అంత్యక్రియులు

  • Published By: naveen ,Published On : May 10, 2020 / 07:32 AM IST
పోలీసుల మానవత్వం.. కరోనా భయంతో కుటుంబసభ్యులు వదిలేసిన మృతదేహానికి అంత్యక్రియులు

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో పోలీసుల పాత్ర ఎనలేనిది. ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తూ కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్ కి ప్రజలకు మధ్య పోలీసులు అడ్డుగోడలా నిలబడి సేవలు అందిస్తున్నారు. వారి సేవల గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. కరోనా కట్టడిలోనే కాదు మానవత్వం చూపించడంలోనూ పోలీసులు ముందుంటున్నారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు.

పోలీసుల గొప్ప మనసు:
తాజాగా కర్నాటక పోలీసులు మానవత్వం చూపించారు. దిక్కుమొక్కు లేక మరణించిన ఓ మానసిక వికలాంగుడి అంత్యక్రియలను వారే దగ్గరుండి నిర్వహించారు. కరోనా భయంతో మృతదేహానికి అంత్యక్రియల నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరిస్తే, పోలీసులు ముందుకొచ్చారు. స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు.

కరోనా భయంతో మృతదేహాన్ని వదిలి వెళ్లిన కుటుంబం:
కర్నాటకలోని చామరాజనగర్ గ్రామంలోకి మూడు రోజుల క్రితం ఓ అడవి ఏనుగు వచ్చింది. మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తిని(44) ఏనుగు తొక్కి చంపేసింది. అయితే కరోనా భయంతో అతడి కుటుంబసభ్యులు మృతదేహం దగ్గరికి వెళ్లలేదు. మృతదేహానికి కరోనా సోకిందేమోనని, దాని దగ్గరికి వెళితే తమకూ కరోనా వస్తుందేమో అనే భయంతో డెడ్ బాడీని తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. అంత్యక్రియలు నిర్వహించడానికి నిరాకరించి డెడ్ బాడీని ఆసుపత్రి మార్చురిలోనే వదిలి వెళ్లిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. 

స్వయంగా అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు:
ఆ వ్యక్తికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించి, అతడి ఆత్మకు శాంతి చేకూర్చాలని అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ మాదెగౌడ, మరో ఇద్దరు పోలీసులు నిర్ణయించుకున్నారు. హిందూ స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఎర్త్ మూవర్ తో వారే స్వయంగా సమాధి తవ్వి అందులో మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. ఆ తర్వాత సమాధి దగ్గర ప్రార్థనలు కూడా చేశారు. ఆ వ్యక్తికి కరోనా ఉందో లేదో తమకు తెలియదని, కానీ ఈ పని చేసినందుకు తమకు తృప్తిగా ఉందని పోలీసులు చెప్పారు. అంతిమ సంస్కారానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మానవత్వం చూపి అంతిమ సంస్కారాలు నిర్వహించిన పోలీసులను అంతా మెచ్చుకుంటున్నారు. సలామ్ పోలీస్ అని సెల్యూట్ చేస్తున్నారు.