PM Modi : ప్రధాని పర్యటనలో ఆత్మాహుతి దాడులు తప్పవని లేఖ .. కేరళలో హైఅలర్ట్‌

ఆత్మాహుతి దాడి చేస్తామంటు బెదిరింపు లేఖ రావటంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు.

PM Modi : ప్రధాని పర్యటనలో ఆత్మాహుతి దాడులు తప్పవని లేఖ .. కేరళలో హైఅలర్ట్‌

PM Modi

Updated On : April 22, 2023 / 4:36 PM IST

PM Modi : ప్రధాని మోదీ సోమవారం (ఏప్రిల్ 24,2023)న కేరళలోని కొచ్చిలో పర్యటించనున్నారు. ఈక్రమంలో మోదీ పర్యటనలో ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ లేఖ రావటంతో కేరళ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మోదీ పర్యటనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేరళలో తొలి వందే భారత్ రైలును ప్రారంభించటానికి ప్రధాని మోదీ ఆదివారం కొచ్చి, మరుసటి రోజు తిరువనంతపురంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మోదీ వందేభారత్ రైలును ప్రారంభించాక పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రోడ్ షోలో కూడా పాల్గొననున్నారు. దీని కోసం కేరళ పోలీసులు మోదీ భద్రత విషయం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం కొచ్చి చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. మంగళవారం 25న వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఈక్రమంలో కేరళ బీజేపీ కార్యాలయానికి ఓ బెదిరింపు లేఖ వచ్చింది. మోదీ కొచ్చి పర్యటనలో ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ ఆ లేఖలో బెదిరించారు. దీంతో కేరళకు చెందిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎం మురళీధరన్ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు.అప్పటికే ప్రధాని పర్యటన విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

బీజేపీ కేరళ అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ ఆ లేఖను అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీపీ ఇంటెలిజెన్స్‌ విభాగం) టీకే వినోద్‌ కుమార్‌కు అందించారు. దీంతో ఇంటెలిజెన్స్‌ విభాగం దర్యాప్తు చేపట్టింది. ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రొటోకాల్స్‌పై ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్‌ అవడంతో ఈ బెదిరింపు లేఖ విషయం బయటికొచ్చింది. ఈ బెదిరింపు లేఖపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో భద్రతను మరింతగా కట్టుదిట్టం చేశారు. ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్‌ అవడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేరళ పోలీసుల వైఫల్యం అని మండిపడ్డారు.