గోరంత వాక్యూమ్‌ క్లీనర్ భలే ఉంది‌..! తెలుగు విద్యార్థి ప్రతిభకు గిన్నిస్‌ రికార్డ్

గోరంత వాక్యూమ్‌ క్లీనర్ భలే ఉంది‌..! తెలుగు విద్యార్థి ప్రతిభకు గిన్నిస్‌ రికార్డ్

Micro vacuum cleaner made  student guinness record : కొత్తకొత్త ఆవిష్కరణలు చేసి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. ముఖ్యంగా భారతదేశంలో యువతకు తెలివితేటలు, క్రియేటివిటీ తక్కువేం కాదు. విభిన్నంగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని తమ ప్రతిభను చాటుకుంటారు. రికార్డులు సృష్టిస్తారు. అటువంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్కిటెక్చర్‌ విద్యార్థి.

కేవలం 1.76 సెంటీమీటర్లు అంటే బొటనవేలు గోరంత సైజు ఉన్న ఓ మైక్రో వాక్యూమ్‌ క్లీనర్‌ను తయారు చేసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నాడు. తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగకు చెందిన తపాల రామచంద్రారెడ్డి, రమణమ్మ దంపతుల కుమారుడు నాదముని పట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో ఆర్కిటెక్చర్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మినీ వాక్యూమ్‌ క్లీనర్‌ తయారీ గురించి ఓ స్నేహితుడు వివరించడంతో దానిపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. తరువాత ఏదైనా కొత్తగా చేయాలని తపించాడు. అలా ఎనిమిది నెలల పాటు కష్టపడి 1.76 సెంటీమీటర్ల మైక్రో వాక్యూమ్‌ క్లీనర్‌ను తయారు చేసి శెభాష్ అనిపించుకున్నాడు.

తాను తయారు చేసిన మైక్రో వాక్యూమ్ క్లీనర్ గురించి వివరిస్తూ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతని ప్రతిభ మెచ్చిన గిన్నిస్ బుక్ రికార్డు ప్రతినిధులు నాదముని ప్రతిభను గుర్తించి రికార్డు సర్టిఫికెట్‌ను పంపారు. నాదముని తయారు చేసిన ఈ వాక్యూమ్ క్లీనర్ ప్రపంచంలోనే అతి చిన్నది కావటంతో గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా నాదముని మొదట 2.2 సెంటి మీటర్ల వ్యాసం కలిగిన వ్యాక్యూమ్ క్లీనర్ కు తయారు చేయగా..ఈ ఆవిష్కరణ ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్ లో నమోదు అయ్యింది. ఇప్పుడు తాజాగా దానికంటే చిన్నది అంటే 1.7 సెంటి మీటర్ల వ్యాక్యూమ్ క్లీనర్ ను కనుగొని గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్ లో చోటు సంపాదించాడు.

ఈ సందర్భంగా నాదముని తండ్రి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి ఏదోకటి తయారు చేయటం తన కొడుకుకు అలవాటని..అలా 10వ క్లాస్ లోనే మల్టీ ఫంక్షనల్ డివైస్ ను కనుగొని జిల్లా స్థాయిలో అవార్డు సంపాదించాడని తెలిపారు. అలా ఈనాడు తన కొడుకు ప్రతిభకు గిన్నీస్ రికార్డు రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇలా..నాదముని ప్రతిభకు తల్లిదండ్రులతో పాటు..టీచర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.