నా ఇలాఖాలో బెదిరింపులకు దిగితే ఊరుకోను, జగన్ ప్రభుత్వానికి బాలయ్య వార్నింగ్

నా ఇలాఖాలో బెదిరింపులకు దిగితే ఊరుకోను, జగన్ ప్రభుత్వానికి బాలయ్య వార్నింగ్

mla balakrishna warns jagan government: టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బాలయ్య. జగన్ పాలనలో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఇసుక, మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయని, రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారం అయిందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. జవాబుదారితనం ఉన్న పార్టీకి ప్రజలు ఓటు వేయాలని బాలయ్య పిలుపు ఇచ్చారు. హిందూపురంను గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు.

ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాలయ్య మండిపడ్డారు. తన ఇలాఖాలో ఏకగ్రీవాలపై బెదిరింపులకు దిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. హిందూపురంలో వైసీపీకి ఒక్క ఏకగ్రీవం కానివ్వలేదన్నారు బాలకృష్ణ. పంచాయతీ ఎన్నికల మాదిరే, మున్సిపల్ ఎన్నికల్లోనూ బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేయాలని చూస్తున్నారని బాలయ్య మండిపడ్డారు.

టీడీపీ పాలనలో.. మట్కా.. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేశామన్న బాలయ్య.. ఇప్పుడు జగన్ పాలనలో ఇవన్నీ రాజ్యమేలుతున్నాయని వాపోయారు. ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని బాలయ్య మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హిందూపురం వచ్చిన బాలయ్య.. ముందుగా సుగురు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అభ్యర్థులతో కలిసి ప్రచారం ప్రారంభించారు.