MP : కరెంట్ పోల్‌ ఎక్కిన‌ విద్యుత్ మంత్రి..చేసిన ఘనకార్యానికి విసుక్కున్న జనాలు

విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేస్తున్న ప్రద్యుమ్న‌సింగ్ తోమర్ తన విచిత్ర విన్యాసాల‌తో మ‌రోమారు వార్త‌ల్లోకి ఎక్కారు. ఏకంగా నిచ్చెన వేసుకుని ఆయనే స్వయంగా కరెంట్ పోల్ ఎక్కి మరమత్తులు చేయటానికి యత్నించి ఉన్న కరెంట్ కూడా పోయేలా చేశారు.

MP : కరెంట్ పోల్‌ ఎక్కిన‌ విద్యుత్ మంత్రి..చేసిన ఘనకార్యానికి విసుక్కున్న జనాలు

Minister Climb Electric Pole

MP Minister climb electric pole :ఎవరు చేసే పని వాళ్లు చేయాలి..అంటారు పెద్దలు. చేతకాని పనిలో వేలు పెట్టి దాన్ని గందరగోళం చేయకూడదు. అలాగే విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేస్తున్నంత మాత్రాన విద్యుత్ మరమత్తులు చేయాలని లేదుకదా. కరెంట్ పోల్ ఎక్కేసి..అక్కడ ఉండే వైర్లను గందరగోళం చేసేస్తే ఏం జరుగుతుంది? ఇదిగో ఇలాగే జరుగుతుంది..మధ్యప్రదేశ్ విద్యుత్‌శాఖ‌ మంత్రిగారు చేసిన ఘనకార్యంలాగే ఉంటుంది అని నిరూపించారు మంత్రిగారు. విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేసే ప్రద్యుమ్న‌సింగ్ తోమర్ తన విచిత్ర విన్యాసాల‌తో మ‌రోమారు వార్త‌ల్లోకి ఎక్కారు. ఏకంగా నిచ్చెన వేసుకుని కరెంట్ పోల్ ఎక్కి అక్కడ ఏదో గజిబిజి గందరగోళం పనిచేశారు. ఫలితంలో కరెంట్ పోయి ఊరంగా చీకటి నిండుకుంది. దీంతో జనాలు ‘ఎక్స్ ట్రాలు’కాకపోతే ఏంటీపనులు అంటూ విసుక్కుంటున్నారు.

వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి ప్రద్యుమ్న‌సింగ్ తోమర్ తన నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవటానికి గ్వాలియర్‌లోని మోతీజీల్ ప్రాంతానికి వ‌చ్చారు. ఈక్రమంలో స్థానికులు మంత్రిగారిని మోతీజీల్ రైల్వే క్రాసింగ్ దగ్గర అడ్డుకున్నారు. తమ సమస్యలన్నింటిని గురించి చెప్పుకున్నారు. విద్యుత్ స‌రాఫ‌రాలోని స‌మ‌స్య‌లు వచ్చి అస్తమాను పవర్ కట్ అవుతోందనీ..స్థానిక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని వాపోయారు.

ట్రాన్స్‌ఫార్మర్‌కు గడ్డి చుట్టుకుపోవటంతో ఆ ప్రాంతంలో త‌ర‌చూ విద్యుత్ స‌ర‌ఫరాలో ఆటంకం ఏర్పడి పవర్ కట్ అవుతోందని మంత్రిగారు తెలుసుకున్నారు. దీనికి మంత్రిగారు ఏం కాదు నేను వచ్చానుగా..మీ సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతటితో ఊరుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్క‌డికి స‌మీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి..మంత్రిగారే స్వయంగా నిచ్చెన వేసుకుని స్థంభాన్ని ఎక్కి మ‌ర‌మ్మ‌తులు చేసేద్దామని నానా యత్నాలు చేశారు. అక్కడ ఉండే వైర్లను గందరగోళం చేశారు. మంత్రిగారికి సమస్యలు చెప్పుకుంటే అధికారులకు చెప్పి చేయిస్తారనుకుంటే ఆయనే ఎక్కేశారే..అంటూ స్థానికులంతా విడ్డూరంగా చూస్తుండిపోయారు.

మంత్రి తనకు తెలిసిందేదో చేసేశారు. స్థంభంపైన ఉన్న వైర్లను నానా గందరగోళం చేసేశారు.కొన్ని గంట‌ల‌పాటు ఆ ప్రాంతంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఆ మంత్రిపై చిర్రుబుర్రులాడుతున్నారు. మొత్తానికి తనకు తెలిసిందేదో చేసేసాక మొత్తం కరెంట్ కట్ అవ్వటంతో భంగపాటు పడిన మంత్రి ఆ మంట కాస్తా స్థానిక విద్యుత్ అధికారులపై చూపించారు. ప్రజలు ఇన్ని పాట్లు పడుతుంటే మీరంతా ఏంచేస్తున్నారు?అంటూ ఫైర్అయ్యారు. దీంతో అధికారులు సార్..ఇకనుంచి అలా జరక్కుండా చూసుకుంటాం సార్ అంటూ చెప్పి..వెంటనే మరమత్తులు చేయటంతో కరెంట్ వచ్చింది. దీంతో మంత్రిగా కూల్ అయ్యారు. ఇకనుంచి ప్రజలు ఇబ్బందులు పడకుండా..పవర్ కట్ అవ్వకుండా చూసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.