కూతురు పుట్టిన సంతోషంతో..సెలూన్ ఓనర్ ఫ్రీగా హెయిర్ కట్టింగ్ ఆఫర్

కూతురు పుట్టిన సంతోషంతో..సెలూన్ ఓనర్ ఫ్రీగా హెయిర్ కట్టింగ్ ఆఫర్

MP salon owner offered free services birth girl child : కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే పుట్టకుండానే పిండం ఉసురు తీసేసే ఈరోజులో ఓ హెయిర్ కట్టింగ్ సెలూన్ యజమాని ఆడపిల్ల పుట్టిందని తెలిసి తెగ సంబర పడిపోయాడు. మా ఇంటిలో మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయాడు. దీంతో తనకు కూతురు పుట్టిందని తెలుసుకున్న వెంటనే మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరంలోని ఓ సెలూన్ యజమాని ఒకరోజంతా ఫ్రీగా హెయిర్ కట్టింగ్ చేస్తానని ఆఫర్ ప్రకటించాడు.

గ్వాలియర్ నగరానికి చెందిన సల్మాన్ మూడు హెయిర్ కటింగ్ సెలూన్లకు యజమాని. ఇతనికి మంగళవారం (జనవరి 4,2021) ఆడపిల్ల పుట్టింది. తనకు ఆడపిల్ల పుట్టిందనే సంతోషంతో తనకున్న మూడు సెలూన్లలో ఒకరోజంతా కష్టమర్లకు ఉచితంగా సేవలు అందించాడు సల్మాన్.

ఆడపిల్ల అంటే మహాలక్ష్మి. ఆడపిల్ల పుట్టిందని బాధపడేవారిని చూస్తే నాకు జాలేస్తుంది. ఆడపిల్ల విలువ తెలిక అలా అనుకుంటారు. ఎంతమంది మగపిల్లలు ఉన్నా…ఒక్క ఆడపిల్ల లేకపోతే ఆఇల్లంతా బోసిపోయి ఉంటుంది.నాకు ఆడపిల్లే పుట్టాలని కోరుకున్నా..అనుకున్నట్లుగానే ఆడపిల్ల పుట్టింది..మా ఇంటికి ఓ చిన్నారి దేవదూత వచ్చింది..అందుకే నాకు ఉన్న మూడు సెలూన్ షాపుల్లో ఒకరోజంతా ఫ్రీగా కట్టింగ్ చేస్తానని తెలిపాడు.

ఆడపిల్ల పుడితే బాధపడకూడదు..సంతోషంగా ఉండాలని తెలియజేయటానికే ఈ ఫ్రీ సర్వీసు ప్రకటించానని తెలిపాడు సల్మాన్. తన మూడు సెలూన్లలో ఒకరోజు ఉచితంగా సేవలు అందించానని సల్మాన్ చెప్పాడు.

ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎన్నడూ భారం కాదని.. తనకు అమ్మాయి పుట్టిందని తెలిసిన వెంటనే పెద్ద వేడుక చేసుకున్నానని సల్మాన్ చెప్పాడు. ఆడపిల్ల పుట్టిందనే సంతోషంతో ఫ్రీ హెయిర్ కట్టింగ్ అని ప్రకటించి అమలు చేస్తున్న సల్మాన్ ను ప్రజలు ప్రశంసిస్తున్నారు.


కాగా ఆడపిల్లను కన్న కోడలిపై అత్తింటివారు పూల వర్షం కురిపించి ఆహ్వానించిన ఆనందకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో జరిగింది. మూడేళ్ల క్రితం పెళ్లైన నవీన్‌, రమ్య దంపతులకు ఆడపిల్ల పుట్టింది. రమ్య మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో ఆడబిడ్డకు జన్మనివ్వగా..ఆ తర్వాత పుట్టింటికి వెళ్లింది. ఆ బుజ్జితల్లి తమ ఊరికి వచ్చే అపూర్వ ఘట్టం కోసం నవీన్‌ తల్లి, కుటుంబ సభ్యులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు.

వారు ఎదురు చూసిన శుభతరుణం వచ్చింది. రమ్య తన బిడ్డను తీసుకొని కేసముద్రంలోని అత్తరింటికి వచ్చింది. అత్తింట ఆ కోడలికి మనుమరాలికి ఎవరూ ఊహించని విధంగా పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.

సాక్షాత్తు ఆ మహాలక్ష్మి తమ ఇంటికి వచ్చిందన్న ఆనందంతో ఇంటి బయట నుంచి లోపలి గది వరకు తల్లీబిడ్డను పూల బాటపై నడిపించారు. మంచంపై పూలను అందంగా పేర్చి మధ్యలో బిడ్డను పడుకోబెట్టి తెర మురిసిపోయారు. అత్తింటివారు చూపించిన ప్రేమకు రమ్య పడిన సంతోషం అంతా..ఇంతా కాదు. అంటే ఆడపిల్లకు మంచి రోజులు వస్తున్నాయన్నమాట.