బర్త్ డే విషెస్ చెప్పిన లాయర్‌ని జైల్లో పెట్టించిన జడ్జి.. అసలేం జరిగిందంటే..

బర్త్ డే విషెస్ చెప్పిన లాయర్‌ని జైల్లో పెట్టించిన జడ్జి.. అసలేం జరిగిందంటే..

arrest

MP lawyer in jail: తనకు బర్త్ డే విషెస్ చెప్పిన లాయర్ ని జడ్జి జైల్లో పెట్టించిన ఘటన మధ్యప్రదేశ్ రత్లాంలో చోటు చేసుకుంది. అదేంటి.. బర్త్ డే విషెస్ చెబితే జైల్లో పెడతారా? అదేమైనా నేరమా? పాపమా? అనే సందేహం రావొచ్చు. అసలేం జరిగిందంటే.. విజయ్ సింగ్ యాదవ్(37) అనే వ్యక్తి అడ్వకేట్. ఫిబ్రవరి 9 నుంచి అతడు జైల్లో ఉన్నాడు. జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కి పుట్టిన రోజు గ్రీటింగ్స్ తెలపడమే అతడి పాలిట శాపమైంది. జైలుకి వెళ్లడానికి కారణమైంది. మేజిస్ట్రేట్ కు మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా అడ్వకేట్ విజయ్ సింగ్ పుట్టిన రోజు శుభాకంక్షలు తెలిపాడు.

ఇంతకీ విజయ్ సింగ్ ఏం చేశాడంటే.. మహిళా మేజిస్ట్రేట్ ఫేస్ బుక్ నుంచి ఆమె ఫోటోని డౌన్ లోడ్ చేశాడు. ఆ తర్వాత హ్యాపీ బర్త్ డే మేడమ్ అంటూ ఆ ఫొటోని అటాచ్ చేసి మెయిల్ పంపాడు. అలాగే స్పీడ్ పోస్ట్ కూడా చేశాడు. ఇది.. మేజిస్ట్రేట్ కు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. తన అనుమతి లేకుండా తన ఫేస్ బుక్ నుంచి తన ఫొటోని డౌన్ లోడ్ చేయడాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నారు. అంతేకాదు, పద్ధతి లేకుండా(అసభ్యకరంగా) మేసేజ్ పంపాడని మండిపడ్డారు. దీనిపై మేజిస్ట్రేట్.. స్టేషన్ రోడ్ పోలీసులకు ఫిబ్రవరి 8న ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు మేజిస్ట్రేట్ ఫిర్యాదు మేరకు అడ్వకేట్ విజయ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. అడ్వకేట్ పై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ నేరాల కింద, ఐటీ యాక్ట్ కింద కేసులు బుక్ చేశారు. మెయిల్ పంపడమే కాకుండా కోర్టు పని వేళల్లో మేజిస్ట్రేట్ కు స్పీడ్ పోస్టు ద్వారా గ్రీటింగ్ కార్డు పంపాడని అడ్వకేట్ పై ఫిర్యాదు నమోదైంది.

దీనిపై అడ్వకేట్ విజయ్ సింగ్ సోదరుడు స్పందించాడు. విజయ్ సింగ్ ను ఇంట్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపాడు. కాగా, తన కేసుని తానే స్వయంగా వాదించుకుంటున్నారు అడ్వకేట్ విజయ్ సింగ్. అరెస్ట్ చేసిన నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 13న, కింది కోర్టు విజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ని ఆశ్రయించాడు. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశాడు.

అడ్వకేట్ విజయ్ సింగ్ సైతం ప్రైవేట్ కంప్లయింట్ నమోదు చేశారు. ఓ సోషల్ వర్కర్ గా, జై కుల్ దేవి సేవా సమితి ప్రెసిడెంట్ గా తాను మేజిస్ట్రేట్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను అన్నాడు. మేజిస్ట్రేట్ ఆరోపిస్తున్నట్టు.. ఆమె ఫేస్ బుక్ నుంచి ఆమె ఫొటోని డౌన్ లోడ్ చేయలేదని, గూగుల్ నుంచి డౌన్ లోడ్ చేశానని వివరణ ఇచ్చాడు.