Komatireddy Venkat Reddy: రేవంత్ సారీ‌పై స్పందించిన వెంకట్‌రెడ్డి.. అతన్ని సస్పెండ్ చేశాకే ఆలోచిస్తానని వెల్లడి

తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ముసలం కొనసాగుతూనే ఉంది. రేవంత్ సారీ చెప్పినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనక్కు తగ్గలేదు. తనపై పరుష పదజాలంతో మాట్లాడిన అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాతనే తాను ఏదైనా మాట్లాడతానని అన్నారు.

Komatireddy Venkat Reddy: రేవంత్ సారీ‌పై స్పందించిన వెంకట్‌రెడ్డి.. అతన్ని సస్పెండ్ చేశాకే ఆలోచిస్తానని వెల్లడి

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ముసలం కొనసాగుతూనే ఉంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన మరుసటి రోజు నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఈ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై పరుష పదజాలంతో దూషించడంతో వివాదం రాజుకుంది.

Revanth Reddy: కోమటిరెడ్డికి సారీ చెప్పిన రేవంత్.. వీడియో విడుదల

ఈ విషయంపై వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చండూరు సభలో ఓ పిల్లాడితో తనను తిట్టించారని, అలా అవమానించేలా మాట్లాడిన వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీనియర్ ను తిట్టిన అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వెంకటరెడ్డి అన్నారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలకు స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి శనివారం క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అద్దంకి దయాకర్ పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. అందుకు తాను సారీ చెబుతున్నానని అన్నారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదని రేవంత్ అభిప్రాయ పడ్డారు. ఇదే సమయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు. చండూరు సభలో తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి ఔన్నత్యంతో తన తరపున క్షమాపణలు చెప్పారని, సోదర భావంతో వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రాతపూర్వకంగా క్షమాపణ చెబుతూ వివరణ ఇచ్చినట్లు అద్దంకి దయాకర్ తెలిపారు.

రేవంత్ సారీ చెప్పడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం సంతోషకరమేనని, కానీ.. తనపై పరుష పదజాలంతో ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ పై చర్యలు తీసుకున్నాకే మిగతావి ఆలోచిస్తానని, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని అన్నారు. రేవంత్ పాదయాత్రలో పాల్గొనే ఆలోచన తనకు లేదని, నాలాంటి ఉద్యమకారుడిని గలీజ్ మాటలు అన్న వ్యక్తిని పార్టీలో కొనసాగిస్తే ప్రజలు హర్షించరంటూ కోమటిరెడ్డి వాఖ్యానించారు.