Naatu Naatu Song : గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన నాటు నాటు పాట రెడీ అవ్వడానికి ఎన్ని నెలలు పట్టిందో తెలుసా??

ఎన్టీఆర్, చరణ్ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని రాజమౌళికి ఆలోచన రాగా పోటాపోటీగా డ్యాన్స్ చేసే ఓ పాట కావలి అని కీరవాణికి చెప్పారట. కీరవాణి దగ్గర ట్యూన్ లేకపోయినా చంద్రబోస్ ని పిలిచి............

Naatu Naatu Song : గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన నాటు నాటు పాట రెడీ అవ్వడానికి ఎన్ని నెలలు పట్టిందో తెలుసా??

RRR naatu naatu song special story

Updated On : January 11, 2023 / 2:00 PM IST

Naatu Naatu Song :  హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR రెండు విభాగాల్లో నామినేట్ అవ్వగా తాజాగా నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ అవార్డు అందుకుంది. అంతర్జాతీయ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును తీసుకున్నారు. నాటు నాటు సాంగ్ కి పోటీగా మరో 14 పాటలు నిలిచినా ఈ అవార్డు మనకి దక్కింది. భారతదేశం నుంచి ఈ విభాగంలో పోటీ పడిన తొలి పాట కూడా ఇదే కావడం విశేషం.

ఇంత గొప్ప అవార్డు సాధించిన నాటు నాటు పాట పూర్తిగా రెడీ అవ్వడానికి దాదాపు 19 నెలలు పట్టిందన్న సంగతి తెలుసా. ఈ పాటని లిరికిస్ట్ చంద్రబోస్ రాయగా, కీరవాణి సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీనికి స్టెప్స్ కంపోజ్ చేశారు.

సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్, చరణ్ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని రాజమౌళికి ఆలోచన రాగా పోటాపోటీగా డ్యాన్స్ చేసే ఓ పాట కావలి అని కీరవాణికి చెప్పారట. కీరవాణి దగ్గర ట్యూన్ లేకపోయినా చంద్రబోస్ ని పిలిచి ఇలా ఒక పాట కావాలి, స్వాతంత్య్రం ముందు పరిస్థితులు, భాషలతో కావాలి అని చెప్పి వివరించారు. ట్యూన్ లేకుండానే పాట రాయమన్నారు. అలాగే ఇద్దరు హీరోలు డ్యాన్స్ చేయడానికి బాగా స్కోప్ ఉండాలి, అంత మాస్ సాంగ్ కావాలి అని చెప్పారట.

హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఉన్న RRR ఆఫీస్ లో రాజ‌మౌళి, కీర‌వాణి, చంద్రబోస్ కూర్చుని ఈ పాట కోసం డిస్కషన్ చేశారు. అనంతరం పాట రాసే భారం మొత్తం చంద్రబోస్ మీద వదిలేశారు. చంద్రబోస్ ఆలోచిస్తూ ఉండగా నాటు నాటు అనే లైన్ తగలడంతో దాని నుంచి పాటని అల్లుకున్నారు. దీని గురించి చంద్రబోస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ట్యూన్ ఇవ్వకుండా పాటని రాయమన్నారు. ట్యూన్ లేకపోవడంతో 6-8 త‌కిట త‌కిట తిశ్ర గ‌తిలో పాటని రాసుకున్నాను. కీరవాణికి ఇది ఇష్టమైన బీట్. జనాలకి ఉత్సాహం ఇచ్చే ఏ పాటైనా ఈ బీట్ లో రాసుకోవచ్చు. అందుకే ఇందులో రాశాను. పైగా ఈ బీట్ లో రాస్తే వాళ్ళు అడిగినట్టు డ్యాన్స్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది అని అన్నారు.

రెండు రోజుల్లోనే మూడు పల్లవులు రాసుకొని చంద్రబోస్ కీరవాణి దగ్గరికి వెళ్లారు. అందులో నా పాట పాడు అనే పదం తీసేసి కీరవాణి నా పాట చూడు అనే పదం పెట్టారు. మిరపతోక్కు, దుముకులాడటం, పోట్ల గిత్త. కీసుపిట్ట, రచ్చబండ.. ఇలా అప్పటి పదాలని జతచేర్చి పాటని రాశారు చంద్రబోస్. 90 శాతం పాట రెండు రోజుల్లో పూర్తయింది. కానీ ఇందులో పదాలు మారుస్తూ, చేరుస్తూ, ట్యూన్ కంపోజ్ చేస్తూ పూర్తి పాట రెడీ అయి పాడించేసరికి ఏకంగా 19 నెలలు పట్టింది. ఈ 19 నెలలు పాట గురించి చర్చిస్తూనే ఉన్నారట.

Narendra Modi : స్పెషల్ మూమెంట్.. ప్రతి ఇండియన్ గర్వపడేలా చేశారు.. RRR టీంపై ప్రధాని మోదీ పోస్ట్..

ఇక ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మొత్తం 95 స్టెప్పులు కంపోజ్ చేశారు. మెయిన్ నాటు నాటు స్టెప్ కి 18 టేకులు తీసుకున్నారు. ఆ స్టెప్పు కోసమే ఏకంగా 30 వెర్షన్స్ తయారుచేస్తే ఇప్పుడున్న నాటు నాటు స్టెప్ ని రాజమౌళి ఓకే చేశారు. ఈ పాటని యుక్రెయిన్ లో షూట్ చేశారు. అలాగే షూటింగ్ టైంలో మళ్ళీ పాటలో చివరి చరణం మార్చాలనుకున్నారట రాజమౌళి. దీంతో చంద్రబోస్ కి కాల్ చేస్తే చంద్రబోస్ పుష్ప సినిమా పనిలో బిజీగా ఉన్న పావుగంటలోనే లాస్ట్ చరణం రాసి ఇచ్చారట. ఆ చరణాన్ని అప్పటికప్పుడు సపరేట్ గా రికార్డ్ చేసి మళ్ళీ కంపోజ్ చేశారు. ఇలా ఒక్కపాట కోసం ఇంతమంది దాదాపు 20 నెలలు కష్టపడ్డారు. ఆ కష్టానికి ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. అలాగే ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లిస్ట్ లో కూడా ఈ పాట ఉంది. అన్ని బాగుండి ఈ పాటకి ఆస్కార్ అవార్డు కూడా వస్తే మరో కొత్త చరిత్ర సృష్టించినవాళ్లు అవుతారు RRR టీం.