Viveka Murder Case: వివేకా హత్యకేసులో రిమాండ్‌కు సునీల్‌.. సీబీఐ రిపోర్ట్‌లో కీలక అంశాలు!

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌కు 14 రోజులు రిమాండ్‌ విధించింది కడప జిల్లా పులివెందుల కోర్టు. సునీల్ యాదవ్ రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక అంశాలను గుర్తించింది.

Viveka Murder Case: వివేకా హత్యకేసులో రిమాండ్‌కు సునీల్‌.. సీబీఐ రిపోర్ట్‌లో కీలక అంశాలు!

Viveka Murder Case

Viveka Murder Case: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌కు 14 రోజులు రిమాండ్‌ విధించింది కడప జిల్లా పులివెందుల కోర్టు. సునీల్ యాదవ్ రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక అంశాలను గుర్తించింది. వివేకా హత్య కేసులో సునిల్ యాదవ్ పాత్రపై ఆధారాలు లభించినట్లు అందులో స్పష్టం చేసింది. సెక్షన్ 164 కింద వాచ్ మెన్ రంగన్న వాంగ్మూలం ఇచ్చారని వివరించింది.

వివేకా హత్యలో సునీల్ ప్రమేయంపై రంగన్న వాంగ్మూలం రికార్డ్ చేశామని చెప్పింది సీబీఐ. అందుకే సునిల్ యాదవ్‌ను సుదీర్ఘంగా విచారణ చేయాలని భావించామని వివరించింది. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని పారిపోయాడని…ఈనెల 2న గోవాలో సునీల్‌ను తండ్రి కృష్ణయ్య సమక్షంలో అరెస్ట్ చేశామని చెప్పారు. గోవా కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై పులివెందులకు తీసుకొచ్చామన్నారు.

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కుట్రకోణం వివరాలు బహిర్గతం చేయడం లేదని…అడిగిన ప్రశ్నలకు అతను సహకరించడం లేదని చెప్తోంది సీబీఐ. ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉందని తెలిపినట్టు సమాచారం. హత్యకు వాడిన ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీబీఐ చెప్తోంది. సునీల్‌యాదవ్‌ను కస్టడీకి ఇవ్వకపోతే విచారణలో జాప్యం జరిగే అవకాశాలున్నాయని అందుకే 13రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది.

వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్‌ యాదవ్‌ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ ఏడాది మార్చిలో అతన్ని ఢిల్లీ పిలిపించి విచారించారు అధికారులు. ఆ తర్వాత కొన్ని రోజులకు సునీల్‌ యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలోని ఇంటికి తాళం వేసి పరారయ్యారు. సునీల్‌ యాదవ్‌ కోసం గాలిస్తున్న సీబీఐ అధికారులు గోవాలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. సునీల్‌ కుటుంబ సభ్యులను కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సునీల్‌ తల్లిదండ్రులు మాత్రం అధికారుల వేధింపులు తట్టుకోలేకనే పారిపోయినట్లు చెబుతున్నారు. సీబీఐ వాళ్లు తమను వేధిస్తున్నారని, ఇరవై రోజుల పాటు కడప జైల్లో పెట్టి తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తూ.. కోర్టు ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమను చంపేస్తారన్న భయంతోనే ఇల్లు వదిలి పారిపోయామని, తమ ప్రాణాలకు రక్షణ లేదన్నారు. ఏ పనీ చేసుకోకుండా నిరంతరం తమను వేధింపులకు గురి చేస్తున్నారని.. అందుకే అధికారుల నుంచి తప్పించుకు తిరుగుతున్నామని అన్నారు. రెండేళ్లుగా సిట్‌ అధికారులు, సీబీఐ అధికారులు నరకం చూపిస్తున్నారని, వాళ్లు పెట్టే టార్చర్‌ భరించలేక ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించినట్లు చెప్పారు.