Supreme Court: అందుకేగా మేమున్నది.. వ్యక్తిగత స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
అందుకే ఏ కేసూ సుప్రీంకోర్టు విచారించనంత చిన్నది కాదని, ప్రాధాన్యత లేనిది ఉండదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కోర్టుల్లో లక్షల్లో కేసులు పెండింగులో ఉన్న నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని వ్యాజ్యాలను విచారణకు తీసుకోవద్దంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించిన రెండు రోజుల అనంతరం సుప్రీం ఈ అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం

Supreme Court comes to the rescue of man sentenced to 18 years in jail for serial electricity theft
Supreme Court: వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం గుర్తించిన అత్యంత అమూల్యమైన, విస్మరించడానికి వీలులేని హక్కని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి హక్కును కాపాడేందుకే తాము ఉన్నామని, దానికి విఘాతం కలిగితే వచ్చే విన్నపాలను ఆలకించడం తమ రాజ్యాంగపరమైన విధి అని, తమ బాధ్యతని కోర్టు పేర్కొంది. విద్యుత్ శాఖ పరికరాలు దొంగిలించిన వ్యక్తికి అలహాబాద్ హైకోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూడ్, జస్టిస్ పీ.ఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ సందర్భంగా ‘‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విన్నపాలను ఆలకించి న్యాయం చేయని పక్షంలో మేమిక్కడ కూర్చుని ఇంకేం చేయడానికి? మేమున్నదే అలాంటి పిటిషనర్ల ఆక్రందనను విని ఆదుకునేందుకు. అటువంటి కేసులను విచారణకు స్వీకరించకపోవడమంటే న్యా ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగించడమే. చూసేందుకు అప్రాధాన్యమైనవిగా కనిపించే ఇలాంటి చిన్న కేసుల విచారణ సమయంలోనే న్యాయ, రాజ్యాంగపరమైన కీలక ప్రశ్నలు, అంశాలు తెరపైకి వస్తాయి. సుప్రీం కోర్టు చరిత్రే ఇందుకు రుజువు. పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సుప్రీంకోర్టు జోక్యానికి ఆర్టికల్ 136లో పేర్కొన్న రాజ్యాంగ సూత్రలే స్ఫూర్తి’’ అని పేర్కొంది.
అందుకే ఏ కేసూ సుప్రీంకోర్టు విచారించనంత చిన్నది కాదని, ప్రాధాన్యత లేనిది ఉండదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కోర్టుల్లో లక్షల్లో కేసులు పెండింగులో ఉన్న నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని వ్యాజ్యాలను విచారణకు తీసుకోవద్దంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించిన రెండు రోజుల అనంతరం సుప్రీం ఈ అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. ఇకపోతే, యూపీకి చెందిన వ్యక్తికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో.. 9 అభియోగాల్లో 18 ఏళ్ల పాటు శిక్ష విధించారు.