Telangana : ఈటలపై వేటు..మంత్రివర్గం నుంచి బర్తరఫ్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్.

Telangana : ఈటలపై వేటు..మంత్రివర్గం నుంచి బర్తరఫ్

Telangana Health Minister Eatala Rajender Removed

Eatala Rajender : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు గవర్నర్ కార్యాలయానికి సీఎంవో లేఖ పంపింది. దీనిని గవర్నర్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ సిఫార్సు మేరకు బర్తరఫ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

నిన్ననే ఈటల ఆరోగ్య శాఖ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేటలో 60 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను ఈటల ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడ్డారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు అందింది. దీనిపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఈటల కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ కు మెదక్ జిల్లా కలెక్టర్ వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందచేశారు.

దీనిని పరిశీలించిన ప్రభుత్వం..ఈటల అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉండడంతో బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు సిఫార్సు చేసింది. ఆయన రాజీనామా చేస్తారని భావించినా..ఈటల స్పందించలేదు. దీంతో సీఎంవో స్వయంగా రంగంలోకి దిగింది. గతంలో వైద్య ఆరోగ్య శాఖను నిర్వహించిన డీఎల్ రవీంద్ర, తాటకొండ రాజయ్యలు బర్తరఫ్ అయ్యారు.

తాజాగా ఈటల రాజేందర్ కూడా బర్తరఫ్ కావడం చర్చనీయాంశమైంది. 66 ఎకరాల ఒక గుంట భూ కబ్జా చేశారని ఈటలపై ఆరోపణలున్నాయి. ఎవరు మంత్రిగా వస్తారు ? కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేస్తారనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read More : Kamal Haasan: కోయంబత్తూరులో ఓడిపోయిన కమల్ హాసన్