ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమల దళంపై గులాబీ నేతల విమర్శలు

తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బీజేపీని టార్గెట్ చేసిందా?….అంటే అవుననే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గులాబీ నేతలు, కమల దళంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఐటీఐఆర్‌పై మొదలైన గొడవ.. ఇప్పుడు ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీవైపు మళ్లింది. రైల్వే కోచ్ హామీని బీజేపీ తుంగలో తొక్కిందని ఆరోపణలు గుప్పిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమల దళంపై గులాబీ నేతల విమర్శలు

TRS target BJP in MLC Elections :  తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్ బీజేపీని టార్గెట్ చేసిందా?….అంటే అవుననే  పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గులాబీ నేతలు, కమల దళంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఐటీఐఆర్‌పై మొదలైన గొడవ.. ఇప్పుడు ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీవైపు మళ్లింది. రైల్వే కోచ్ హామీని బీజేపీ తుంగలో తొక్కిందని ఆరోపణలు గుప్పిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ దూకుడు మీదున్న బీజేపీకి టీఆర్ఎస్ కళ్లెం వేస్తోంది. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను ఎన్డీయే ఇవ్వలేకపోయిందని… యూపీఏ ఇచ్చిన అనుమతులను రద్దు చేసిందని టీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది. ఎన్ని లేఖలు రాసిన, డీపీఆర్‌లు ఇచ్చినా పక్కకు పెట్టిందని ఎదురుదాడికి దిగింది.

ఇప్పుడు రైల్వే లైన్లు, ఖాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే డివిజన్, రైల్వే యూనివర్సిటీలు ఇవ్వడంలో కూడా బీజేపీ విఫలమైందని ఆరోపణలు ఎక్కుపెట్టింది. ప్రతిసారీ బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిస్తోందని.. రాష్ట్రంలో ఉన్న కమలం నేతలు ఏం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించింది.

తెలంగాణకు కేటాయించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేయడంపై మంత్రి కేటీఆర్‌ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగుల ఉపాధి అవకాశాలపై కేంద్రం నీళ్లు చల్లిందని విమర్శించారాయన.

ఈ వివాదం ఒకవైపు నడుస్తుండగానే ఇప్పుడు కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అంశం మరో రాజకీయ అస్త్రంగా మారింది. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీపై సమాచార హక్కు ద్వారా అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంపై మండిపడ్డారు కేటీఆర్‌. తెలంగాణ పట్ల తన వ్యతిరేక వైఖరిని బీజేపీ చాటుకుందంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన 150 ఎకరాల భూమిని కేంద్ర రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పగించింది. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం సీఎం కేసీఆర్, ప్రధానిని స్వయంగా కలిసి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టుల విషయంలో పదే పదే సంప్రదింపులు జరుపుతున్నా, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు ఆర్ధిక మంత్రి హరీష రావు.

తెలంగాణకు రిక్తహస్తం చూపడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా….. రైల్వేను పూర్తీగా ప్రైవేటీకరణ చేసేందుకే కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మించడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు.

మొత్తానికి.. ఐటీఐఆర్‌, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం అంశాలు… బీజేపీని డిఫెన్స్‌లో పడేస్తున్నాయి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగాలపై టీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ నేతలకు.. ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి రివర్స్‌లో వచ్చిన ఈ కౌంటర్‌ అటాక్స్‌ ఊహించని పరిణామంగానే కనిపిస్తున్నాయి.