Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్ కేసులో హైపవర్ కమీషన్ ముందు సజ్జనార్.. ప్రశ్నలివే!

తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో హైపవర్ కమీషన్ ముందు హాజరయ్యారు సజ్జనార్.

Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్ కేసులో హైపవర్ కమీషన్ ముందు సజ్జనార్.. ప్రశ్నలివే!

Cyberabad Cp Sajjanar Transfered As Ts Rtc Md

Disha Encounter: తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో హైపవర్ కమీషన్ ముందు హాజరయ్యారు అప్పటి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్.. దిశ ఘటన పరిణామాలు, తర్వాత ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై కమిషన్‌కు సమాధానాలు చెప్పారు. ఈ విచారణలో సజ్జనార్ చెప్పే వివరాలు కీలకం కానున్నాయి. విచారణ అనంతరం సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉంది.

కమిషన్ ప్రశ్నలు.. సజ్జనార్ సమాధానాలు:

మిమ్మల్ని ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా మీడియా అంటుంది.. మీరు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అని ఒప్పుకుంటారా? ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అంటే ఏమిటి? -కమిషన్
నేను అంగీకరించను.. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అంటే నాకు తెలియదు -సజ్జనార్

నందిగామ, ఆమన్‌గల్‌ పోలీస్‌స్టేషన్ల సబ్‌ ఇన్‌స్పెక్టర్లు(ఎస్‌ఐ)లు వినియోగించిన 9 ఎంఎం పిస్టల్‌ 2019, డిసెంబర్‌ 3న సీజ్‌ చేశారని రిమార్క్స్‌ కాలమ్‌లో ఉంది. కానీ, డిసెంబర్‌ 6న ఎన్‌కౌంటర్‌లో అవే పిస్టల్‌లను ఎలా ఉపయోగించారు? -కమిషన్
పూర్తి వివరాలు తెలియవు.. తనిఖీ చేశాక చెబుతా.. -సజ్జనార్

9 ఎంఎం పిస్టల్‌ ఎవరు ఉపయోగించారు.? -కమిషన్
ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన 9ఎంఎం పిస్టల్‌‌ను నందిగామ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ నర్సింహకు కేటాయించారు. కానీ, ఆ సమయంలో నందిగామ పీఎస్‌కు వెంకటేశ్వర్లు ఎస్‌ఐగా పోస్టింగ్ అవ్వడంతో పిస్టల్‌ వెంకటేశ్వర్లు చేతికి వెళ్లింది. -సజ్జనార్

2019, నవంబర్‌ 29వ తేదీ రాత్రి 10 గం.కు నిందితుల స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. అయితే, మీరెలా మూడు గంటల ముందుగానే రాత్రి 7గంటలకే మీడియాకు నేరం జరిగిన తీరును వివరించారు? -కమిషన్
2019, నవంబర్‌ 29వ తేదీన శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ట్రాఫిక్‌ సమస్యలపై స్టడీ ఉంటే వెళ్లాను. అక్కడ్నుంచి క్యాంప్‌ ఆఫీస్‌కు వస్తుంటే శంషాబాద్‌ డీసీపీ ఎన్‌. ప్రకాశ్‌రెడ్డి నుంచి ఫోన్‌ వచ్చింది. డీసీపీ కార్యాలయానికి రావాలన్నది ఫోన్‌ సారాంశం. అక్కడికి వెళ్లిన నాకు నిందితుల అరెస్ట్‌‌పై డీసీపీ బ్రీఫింగ్‌ ఇచ్చారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి వివరాలు చెప్పమన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు మీడియాకు వివరాలను వెల్లడించాను. ఈ కేసును నేను ప్రత్యేకంగా పర్యవేక్షించలేదు. మార్నింగ్‌ బ్రీఫింగ్‌లో పాల్గొనేవాడిని అంతే.. ఈ కేసు విషయంలో ఏర్పాటు చేసిన 9 బృందాలకు శంషాబాద్‌ డీసీపీ నేతృత్వం వహించారు. -సజ్జనార్

నిందితుల కస్టడీ విచారణకు ప్రత్యేక పోలీస్‌ బలగాలను నియమించారా? -కమిషన్
నిందితుల కస్టడీ విచారణ సమయంలో అదనపు బలగాలు కావాలని 2019, డిసెంబర్‌ 2న డీసీపీ అభ్యర్థిస్తే, అదనపు డీసీపీ, స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ) పోలీసులను అపాయింట్‌ చేశాము. నిందితుల తరలింపునకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాను. డీసీపీ అభ్యర్థన మేరకే ఎస్కార్ట్‌ డ్యూటీ పోలీసులకు ఆయుధాలు కేటాయించాము.

మీరు ప్రతీది డీసీపీ చెబితేనే తెలిసిందన్నారు.. మీరు డీసీపీపైనే ఆధార పడతారా? -కమిషన్
గ్రౌండ్ లెవెల్‌లో ఆఫీసర్‌లకు. పూర్తి సమాచారం ఉంటుందని, నేను వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తాను -సజ్జనార్

దిశ అత్యాచారం జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు -కమిషన్
మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడంలో కొంత సమయం లేట్ అయ్యింది – సజ్జనార్

ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు -కమిషన్
ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశాం -సజ్జనార్

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో విచారణ ముగియకముందే మీడియా సమావేశం ఎందుకు పెట్టారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వల్లే విచారణ సరిగా చేయలేకపోయినట్లు సాక్షులు చెప్పారు? -కమిషన్
ఎన్‌కౌంటర్ స్పాట్‌కి 300 మీటర్ల దూరంలో విచారణకు ఆటంకం కలగకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం -సజ్జనార్

మీడియా సమావేశం కోసం కుర్చీలు, టేబుళ్లు తదితర సామగ్రిని అంత తక్కువ సమయంలో ఎలా తీసుకుని వచ్చారు? -కమిషన్
షాద్ నగర్ పోలీసులు పూర్తి సామగ్రిని తీసుకుని వచ్చారు. ఎక్కడి నుంచి సామాగ్రిని తీసుకొచ్చారో తెలియదు -సజ్జనార్

స్పెషల్‌ ఆపరేషన్‌ టీం(ఎస్‌ఓటీ)ను ఎలా ఎంపిక చేస్తారు? వీళ్లు సీపీకి రిపోర్ట్‌ చేస్తారా? -కమిషన్
సివిల్‌ ఫోర్స్‌కు చెందిన అనుభవజ్ఞులైన పోలీసులను ఎస్‌ఓటీలో నియమిస్తారు. సందర్భాన్ని బట్టి సీపీకి, స్థానిక స్టేషన్లలో రిపోర్ట్‌ చేస్తుంటారు. -సజ్జనార్‌

సైబరాబాద్‌ సీపీ పరిధిలోనూ ప్రత్యేక ఆయుధాల నమోదు రిజిస్టర్‌ ఉంటుందా? -కమిషన్
ట్రాఫిక్, క్రైమ్‌ విభాగాల్లానే సైబరాబాద్‌ సీపీలో ఆర్మ్స్‌ రిజర్వ్‌ వింగ్‌ కూడా ఉంటుంది. -సజ్జనార్‌

నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు ఇచ్చిన 9 ఎంఎం పిస్టల్‌ గురించి సైబరాబాద్‌ సీపీ రిజిస్టర్‌లో నమోదు చేశారా? -కమిషన్
ఆయుధాల నమోదు ప్రక్రియకు ప్రత్యేకంగా సీఏఆర్‌ వింగ్‌ ఉంది. కొన్ని సందర్భాల్లో సీఏఆర్‌ నేరుగా స్టేషన్లకు ఆయుధాలను జారీ చేస్తుంది. -సజ్జనార్‌

ఎస్కార్ట్‌ పోలీసులకు 6 పొడవైన ఆయుధాలను కేటాయించే ముందు వాటి అవసరం ఏముందని ప్రశ్నించారా? -కమిషన్
లేదు, శంషాబాద్‌ డీసీపీ కోరితేనే జారీచేశా -సజ్జనార్‌