Voting With Selfie: ఓటేస్తూ సెల్ఫీలు.. ఆపై సోషల్ మీడియాలో పోస్టులు!

ఏపీలో పరిషత్ ఎన్నికలలో ఓటేసిన కొందరు యువకులు అత్యుత్సాహానికి పోయి వివాదాలను కొనితెచ్చుకున్నారు. ఓటర్లలోనే కొందరు ఔత్సాహికులు ఓటేస్తూ సెల్ఫీలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Voting With Selfie: ఓటేస్తూ సెల్ఫీలు.. ఆపై సోషల్ మీడియాలో పోస్టులు!

Voting With Selfie

Voting With Selfie: ఏపీలో పరిషత్ పోరుకు బుధవారం మధ్యాహ్నం వరకు సస్పెన్స్ కొనసాగగా.. కోర్టు క్లారిటీతో గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. పలుచోట్ల ఘర్షణలు.. బ్యాలెట్ పేపర్లలో గుర్తుల గల్లంతు.. అభ్యర్థుల పేర్లు మాయమవడంతో పాటు ఉపసంహరించుకున్న అభ్యర్థుల పేర్లు సైతం బ్యాలెట్ పేపర్ల మీద ఉన్నాయని ఒకటి రెండు చోట్ల ఆందోళనలు జరగగా వివాదాలు తలెత్తిన చోట ఎన్నికలను వాయిదా వేశారు. ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణల మధ్యనే మొత్తంగా ఎన్నికలైతే సజావుగా జరుగుతున్నాయి. కాగా ఓటేసిన కొందరు యువకులు అత్యుత్సాహానికి పోయి వివాదాలను కొనితెచ్చుకున్నారు. బూత్ లో ఓటేస్తూ సెల్ఫీలు తీసుకున్న ఓటర్లు కొందరు ఆ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఓటింగ్ అనేది అత్యంత రహస్య ప్రక్రియ. ఓటర్లు తమకి నచ్చిన అభ్యర్థికి నిర్భయంగా ఓటేయాలని.. వేసిన ఓటు ఎవరికి వేసారో అత్యంత రహస్యంగా ఉంచి ఓటరు మహాశయుని హక్కుకు భంగం కలగకుండా చూడాలని రాజ్యాంగం చెప్పే మాట. కానీ.. ఏపీలో పరిషత్ ఎన్నికలలో ఓటర్లలోనే కొందరు ఔత్సాహికులు ఓటేస్తూ సెల్ఫీలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారడంతో పాటు వివాదాస్పదమవుతున్నాయి. తాము ఎవరికి ఓటు వేస్తున్నామో చెప్పేందుకే ఇలా చేశారా.. లేక ఒప్పందంలో భాగంగానే ఇలా ఓటేసిన తర్వాత ధ్రువీకరణ కోసం ఫోటోలు తీసుకోగా అవి అనుకోకుండా లీక్ అయ్యాయా అనే చర్చలు సాగుతున్నాయి.

ఫోటోలలో ఉన్న అభ్యర్థుల పేర్లను బట్టి చూస్తే ఈ ఫోటోలు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, పి.లక్ష్మీవాడ గ్రామాల్లో బూత్ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా పోలింగ్ బూత్ లో ఇంత జరుగుతున్నా.. యువకులు సెల్ఫీలు తీసుకుంటున్నా పోలింగ్ సిబ్బంది పట్టించుకోకపోవడంపైనా పలు విమర్శలు వస్తున్నాయి. అసలు పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్స్ నిషేధం ఉంటుంది. కానీ యువకులు ఫోన్స్ తీసుకెళ్లడం..సెల్ఫీలు తీసుకుంటున్నా ఎన్నికల సిబ్బంది పట్టించుకోకపోవడంతో విమర్శల పాలవుతున్నారు.