Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

డిజిటల్‌ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో చాలా చోట్ల పాన్‌ కార్డు నెంబరు బహిర్గతం చేయాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో మనం సమర్పించిన నెంబరును పొందడం సైబర్‌ నేరగాళ్లు దక్కించుకుని మోసాలకు తెరలేపుతున్నారు.

 Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

Pan Card

Pan Number : ఇటీవలికాలంలో పాన్ కార్డు అనే పదం బాగా వినిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు అనగా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అవసరత ఏర్పడింది. ఆదాయపు పన్ను శాఖ ఈ పాన్ కార్డును జారీ చేస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ టాక్స్ పర్యవేక్షణలో భారత ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం దీనిని భారత ఆదాయపు పన్ను చట్టం జారీ చేస్తుంది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ అయిన పాన్‌ కార్డుపై 10 డిజిట్స్‌ ఉంటాయి. పన్ను చెల్లింపు, పన్ను మినహాయింపు, సోర్స్ క్రెడిట్స్ వద్ద పన్ను వసూలు, ఆదాయ రాబడి, సంపద, బహుమతి లేదా ఏదైనా నిర్దిష్ట లావాదేవీలకు పాన్ కార్డు అవసరత ఉంటుంది.

బ్యాంకులో రూ.50,000లకు పైన మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటే పాన్ కచ్చితంగా కావాలి.హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు అక్కడ బిల్లు రూ.25,000 దాటిందంటే.. ఆ బిల్లు చెల్లించాలన్న పాన్ నెంబర్ చెప్పాల్సిందే.మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.50,000 లేదా ఆపైన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలన్నా పాన్ తప్పనిసరి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, రుణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా పాన్ కార్డు ఇవ్వాల్సిందే. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే పాన్ కార్డు నెంబరు వినియోగించాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ క్రమంలో పాన్ కార్డు అవసరత పెరిగిపోవటంతో దీనిని ఆసరగా చేసుకుని మోసాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

పాన్ కార్డు విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. తెలియని వ్యక్తులకు పాన్ నెంబర్ ను చెప్పటం వల్ల వారు దానిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఓ రిక్షా కార్మికుడికి 3కోట్లు చెల్లించాలంటూ అదాయపు పన్ను శాఖ నోటీసుల జారీతో పాన్ కార్డు దుర్వినియోగం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రిక్షాకార్మికుడి పాన్ నెంబర్ బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళటం వల్లే ఇదంతా జరిగిందన్న విషయం దర్యాప్తులో తేలటంతో అంతా నివ్వెరపోవాల్సి వచ్చింది.

మనకు తెలియకుండానే పాన్‌ వివరాలు మనచేతుల్లో నుండి బయటి వ్యక్తుల చేతికి వెళ్ళితున్నాయి. కొన్నిసార్లు జిరాక్స్‌ షాప్‌లు, నెట్‌ సెంటర్లల్లో పాన్‌ జిరాక్స్‌ కాపీలను నిర్లక్ష్యంగా వదిలేయటం, స్కానింగ్‌ కోసం ఇచ్చి డిలీట్‌ చేయించకుండా వదిలేయటం వల్ల మోసాలకు తావిచ్చిన వారం అవుతాము. ఇలా చేయటం వల్ల మన వ్యక్తిగత వివరాలు బయటకు తెలిసిపోవటం జరుగుతుంది. వీటిని ఆసరాగా చేసుకుని మోసగాళ్ళు అదాయపన్ను నుండి తప్పించుకునేందుకు తాము కొనుగోలు చేసిన ఖరీదైన వస్తువులకు మన పాన్ వివరాలు సమర్పించటం వల్ల అదాయపన్నుశాఖ చివరకు నోటీసులు పంపే పరిస్ధితులకు దారితీస్తుంది.

డిజిటల్‌ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో చాలా చోట్ల పాన్‌ కార్డు నెంబరు బహిర్గతం చేయాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో మనం సమర్పించిన నెంబరును పొందడం సైబర్‌ నేరగాళ్లు దక్కించుకుని మోసాలకు తెరలేపుతున్నారు. ఖరీదైన నగలు కొనే సమయంలో పాన్‌ వివరాలు సమర్పించడానికి ఇష్టపడని కొనుగోలుదారుల కోసం ఇలా దొంగిలించిన పాన్‌ నెంబరును ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మోసాలు చాలా మందికి కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు. అయితే ఐటీ రిటర్న్స్‌లో ఫారం 26ఏఎస్‌ను తరచూ చెక్‌ చేసుకోవటం ద్వారా మన కార్డును ఏ లావాదేవీల్లో వినియోగించారో తెలుసుకోవచ్చు.

పాన్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తులు పాటించటం మంచిది. అత్యవసరమైతే తప్ప పాన్‌ నెంబరును బహిర్గతం చేయొద్దు. గుర్తింపు కార్డులు సమర్పించే అవకాశం ఉన్న చోట పాన్‌ కార్డు ఇవ్వకుండా ఇతర గుర్తింపు కార్డులు ఇవ్వటం ఉత్తమం. పాన్‌కార్డులను అవసరానికి మించి జిరాక్స్‌లు తీయించి వాటిపై సంతకాలు చేయొద్దు. ఒకవేళ తప్పనిసరిగా సంతకం చేయాల్సి వస్తే తేదీని వేయడం మర్చిపోవద్దు. మీ బ్యాంకు ఖాతాను తరచూ చెక్‌ చేసుకోండి. మీకు తెలియకుండా ఏవైనా లావాదేవీలు జరిగితే వెంటనే అప్రమత్తమవ్వండి. పాన్‌ కార్డు కనిపించకపోయినా..ఎవరైనా దొంగిలించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం మాత్రం మర్చిపోకండి.