షబానా అజ్మీ తల్లి నటి షౌకత్ అజ్మీ కన్నుమూత

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 07:40 AM IST
షబానా అజ్మీ తల్లి నటి షౌకత్ అజ్మీ కన్నుమూత

అలనాటి  నటి..ప్రముఖ నటి షబానా ఆజ్మీ తల్లి షౌకత్‌ ఆజ్మీ తన 93 ఏళ్ల వయస్సులో శుక్రవారం (నవంబర్ 22) సాయంత్రం కన్నుమూశారు. వయసురీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో ఆమె మరణించారని షబానా ఆజ్మీ భర్త ప్రముఖ రచయిత జావెద్‌ అక్తర్‌ తెలిపారు. ఆమెకు నటి కుమార్తె షబానా,కుమారుడు సినిమాటోగ్రాఫర్ బాబా అజ్మీ ఉన్నారు.

అనారోగ్య సమస్యలతో కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ అంబానీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ షైకత్ ఆజ్మీ కన్నుమూశారు. ఆమె  అంత్యక్రియలను శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. షౌకత్‌ ఆజ్మీ భర్త ప్రముఖ ఉర్దూ కవి..సినీ గీత రచయిత కైఫీ ఆజ్మీ. హైదరాబాద్‌ వాస్తవ్యురాలైన షౌకత్‌ వివాహానంతరం భర్తతో కలిసి ముంబైలో సెటిల్ అయ్యారు.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా(సీపీఐ)కు సాంస్కృతిక వేదికలుగా నిలిచిన ఇండియన్‌ పీపుల్‌ థియేటర్‌ అసోసియేషన్‌ (ఐడబ్ల్యూఏ)కు వ్యవస్థాపకులుగా ఆ సంస్థల అభివృద్ధిలో భర్త కైఫీ ఆజ్మీతో కలిసి షౌకత్‌ ఎనలేని కృషి చేశారు. ఆస్కార్‌ నామినేటెడ్‌ చిత్రం ‘సలాం బాంబే’తో పాటు బజార్‌, ఉమ్రావో జాన్‌, మీరా నాయర్‌ వంటి చిత్రాల్లో షౌకత్‌ ఆజ్మీ నటనతో తనదైన ముద్రవేసారు. విమర్శకుల  ప్రశంసలు అందుకున్నారు. 2002లో విడుదలైన సాథియా చిత్రంలో షౌకత్‌ ఆజ్మీ ఆఖరిసారి కనిపించారు. ‘కైఫీ అండ్‌ ఐ’ పేరుతో ఆమె ఆత్మ కథను వెలువరించారు. షౌకత్‌ మృతికి బాలీవుడ్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. షౌకత్‌ ఆజ్మీ 12 సినిమాలతో పాటు పలు నాటకాల్లో నటించారు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.