Congress Party : గుజరాత్ మోడల్‌ ప్రచారానికి.. కర్ణాటక మోడల్‌ తో కాంగ్రెస్ చెక్‌!

బలవంతుడైన శత్రువుని ఎలా ఎదుర్కోవడానికి ఎలా వ్యవహరించాలన్నది కర్ణాటక ఫలితంతో అనుభవంలోకి తెచ్చుకుంది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే సూత్రం ఈ ఏడాది ఎన్నికలు జరిగే మిగిలిన రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ అనుసరించాలన్నది కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహం.

Congress Party : గుజరాత్ మోడల్‌ ప్రచారానికి.. కర్ణాటక మోడల్‌ తో కాంగ్రెస్ చెక్‌!

Congress Party Karnataka Model : షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అంతకన్నా ముందు ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఎన్నికల హామీలు అమలుచేసి, సంక్షేమ పాలనతో సానుకూలత సాధించి.. ఆ మోడల్‌తో ముందు రాష్ట్రాల్లో, తర్వాత దేశవ్యాప్తంగా ఓట్లడగాలని కాంగ్రెస్ భావిస్తోంది. గుజరాత్ మోడల్‌ (Gujarat Model) అంటూ బీజేపీ చేసిన అభివృద్ధి ప్రచారానికి.. కర్ణాటక మోడల్‌ సంక్షేమంతో చెక్‌పెట్టాలని వ్యూహం రచించింది.

రాజకీయ చైతన్యం ఎక్కువగా, స్థిరత్వం తక్కువగా ఉండే రాష్ట్రం కర్ణాటక. అనిశ్చితి రాజకీయాలకు, కులాల కుంపట్లకు కేరాఫ్ అడ్రస్. అన్నిరాష్ట్రాల్లోలానే కర్ణాటక కాంగ్రెస్‌లోనూ విపక్ష పాత్ర పోషించేందుకు సొంత పార్టీ నేతలే సిద్ధంగా ఉంటారు. ఎన్నికల వేళ… ఈ కుమ్ములాటలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో ఈ సారి కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈ విభేదాలను తాత్కాలికంగానయినా పక్కన పెట్టారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రంలో… రాహుల్ మార్గదర్శకత్వంలో ఇద్దరు కీలక నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. కలిసికట్టుగా కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. విచిత్రంగా.. ఎన్నికల తర్వాతా అదే సామరస్యపూర్వక వాతావరణం కొనసాగిస్తున్నారు.

ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ జరిపినప్పటికీ.. ఒక్కసారి నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇక సిద్ధరామయ్య, డీకే.. రెచ్చగొట్టే ప్రకటనల జోలికి వెళ్లడం లేదు. అనుచరులను కవ్వించడం లేదు. సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేతలు అంతర్గత విభేదాలను పక్కనపెడితే… కాంగ్రెస్ ఎలాంటి ఫలితాలు సాధించగలదనేదానికి కర్ణాటకను మించిన ఉదాహరణ లేదు. బలవంతుడైన శత్రువుని ఎలా ఎదుర్కోవడానికి ఎలా వ్యవహరించాలన్నది కర్ణాటక ఫలితంతో అనుభవంలోకి తెచ్చుకుంది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే సూత్రం ఈ ఏడాది ఎన్నికలు జరిగే మిగిలిన రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ అనుసరించాలన్నది కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహం.

కర్ణాటకే ఇప్పుడు కాంగ్రెస్ రోల్‌మోడల్
నేతల ఐక్యతా మంత్రంలోనే కాదు.. పార్టీని ప్రజలకు చేరువచేసే అనేక వ్యూహాల్లోనూ కర్ణాటకే ఇప్పుడు కాంగ్రెస్ రోల్‌మోడల్. ఎన్నికలకు చాలా నెలల ముందునుంచే బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విశేషంగా కృషిచేశారు కాంగ్రెస్ నేతలు. ఇందుకోసం సాంకేతికతనూ వినియోగించుకున్నారు. ఆ అవినీతిని.. దేశమంతా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతున్న ధరల పెరుగదలను పరిగణనలోకి తీసుకుని.. స్థానిక పరిస్థితులను అన్వయించి.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఐదు హామీల అమలుకు రూపకల్పన చేశారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ నాటికే కాంగ్రెస్ నేతలకు గెలుపుపై ఓ రకమైన ధీమా వచ్చింది.

తాము ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ప్రజల్లో ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత ఉంటే.. ఆ వ్యతిరేకతను ప్రతిపక్షానికి ఓట్లగా మార్చాలంటే సంక్షేమపథకాలే శరణ్యమన్న విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ ఐదు హామీలను ప్రకటించి.. బీజేపీని చావుదెబ్బ కొట్టింది. ఈ సంక్షేమపథకాలు, అభివృద్ధి మేలు కలయికతో కర్ణాటక రూపురేఖలు మారుస్తామంటోంది కాంగ్రెస్. ఇది కర్ణాటక మోడల్‌గా ప్రచారంలోకి తెచ్చి.. ఈ ఏడాది ఎన్నికలు జరిగే తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలోనూ ఇలాంటి హామీలు ఇచ్చేందుకు వ్యూహ రచనచేసింది.

Also Read: మొదటిసారి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ..

భారత్ జోడో యాత్రతో మారిన రాహుల్ ఇమేజ్
రాహుల్ గాంధీకి కర్ణాటక విజయం చాలా ప్రత్యేకం. ఎవరు ఔనన్నా కాదన్నా.. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)తో రాహుల్ ఇమేజ్ మారిపోయింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపుకు దారితీసిన కారణాల్లో జోడోయాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. 2004 నుంచి రాహుల్ గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఓ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ ప్రభావం స్పష్టంగా కనిపించింది కర్ణాటకలోనే. ఈ ఏడాది ఎన్నికలు జరిగే మిగిలిన రాష్ట్రాల్లోనూ కచ్చితంగా రాహుల్ ప్రభావం ఉంటుంది.

Also Read: చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ.. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్

కర్ణాటకలోలానే సంక్షేమ హామీల రూపకల్పన కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు విస్తృతంగా శ్రమించాలి. దేశంలో పరిస్థితులు, స్థానికుల అవసరాలకు తగ్గట్టుగా పథకాలు రూపొందించాలి. తెలంగాణలో ఇప్పటికే భారీగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రజల్లోకి చొచ్చుకుపోవాలంటే.. బీఆర్‌ఎస్‌ అమలుచేస్తున్న పథకాలను మించి ప్రజలకు లబ్దికలిగించేవాటిపై దృష్టిపెట్టాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీ అన్న గుర్తింపుకు తోడు.. ప్రజల మనసు గెలుచుకునే భారీ పథకాలతోనే కాంగ్రెస్ ఓట్లు సాధించగలదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే.. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ భవితవ్యాన్ని నిర్ధారించబోతున్నాయి.