AIADMK vs BJP: బీజేపీతో పొత్తు ఉండదని బాంబ్ పేల్చిన అన్నాడీఎంకే.. ఎన్నికలకు ముందు బీజేపీకి పెద్ద షాక్

ద్రావిడ నాయకుడు సి.ఎన్. అన్నాదురైని విమర్శిస్తూ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి.జయకుమార్ మండిపడ్డారు

AIADMK vs BJP: బీజేపీతో పొత్తు ఉండదని బాంబ్ పేల్చిన అన్నాడీఎంకే.. ఎన్నికలకు ముందు బీజేపీకి పెద్ద షాక్

Tamilnadu Politics: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు.. తమ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇండియా అనే పేరుతో విపక్షాలు కూటమి కట్టడంతో బీజేపీ సైతం తన ఎన్డీయే కూటమిని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీకి పెద్ద షాక్ ఎదురైంది. ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన తమిళనాడు పార్టీ అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) బాంబ్ పేల్చింది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)తో పొత్తు ఉండదని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత కుండబద్దలు కొట్టి చెప్పారు. కొద్ది రోజులుగా ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ ప్రకటన రావడం గమనార్హం.

ద్రావిడ నాయకుడు సి.ఎన్. అన్నాదురైని విమర్శిస్తూ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి.జయకుమార్ మండిపడ్డారు. అన్నామలై, దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత సహా అన్నాడీఎంకే నేతలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తే తమ పార్టీ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. బీజేపీని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని లక్ష్యంగా చేసుకుని “అన్నామలై అన్నాడీఎంకేతో పొత్తును కోరుకోవడం లేదుజ అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు అలా కోరుకుంటున్నారు. మన నేతలపై విమర్శలు చేస్తే సహించాలా? బీజేపీ ఇక్కడ అడుగు పెట్టదు. మీ ఓటు బ్యాంకు మీకు తెలుసు. మా వల్లే మీకు ఇక్కడ ఉనికి ఏర్పడింది’’ జయకుమార్ అన్నారు.

Jharkhand: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‭కు సుప్రీంలో ఎదురుదెబ్బ.. ఈడీ పిటిషన్ పై నో రిలీఫ్

“మనపై విమర్శలను ఇకపై సహించలేము. పొత్తు విషయానికొస్తే అది కూడా అవసరం లేదు. బీజేపీ అన్నాడీఎంకేతో లేదు. ఎన్నికల సమయంలోనే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఇది మా స్టాండ్” అని జయకుమార్ తేల్చి చెప్పారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా అని జయకుమార్‌ను ప్రశ్నించగా, “నేను మీతో ఎప్పుడైనా ఆ హోదాలో మాట్లాడానా? పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో మాత్రమే మాట్లాడతాను’’ అని అన్నారు. దీంతో జయకుమార్ వ్యాఖ్యలు చూస్తుంటే.. తమిళనాడులో బీజేపీకి కష్టకాలం ఎదురైనట్లే కనిపిస్తోంది.