ఒక దేశం ఒకే కార్డు.. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఆ కార్డులోనే!

  • Published By: vamsi ,Published On : September 23, 2019 / 08:26 AM IST
ఒక దేశం ఒకే కార్డు.. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఆ కార్డులోనే!

ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, ఓటరు కార్డు వంటి అన్నిరకాల కార్డులను ఒకే కార్డులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది. అన్ని సౌకర్యాలతో దేశంలోని పౌరులందరికీ మల్టీ పర్పస్ ఐడెంటిటీ కార్డ్ లు ఇచ్చే ఆలోచనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించారు.

ప్రస్తుతం ఆధార్‌, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతా, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు కార్డు, పాన్ కార్డు ఇలా ఒక్కో ప్రయోజనానికి ఒక్కో కార్డు అందుబాటులో ఉంది. అయితే వాటి స్థానంలో దేశంలో ప్రతీ పౌరుడికి ‘ఆల్‌-ఇన్‌-వన్‌’గా ఉపయోగపడేలా ఒకటే కార్డు ఉండేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

సమాచారమంతా కలిపి ఒకటే కార్డులో పొందుపరిచే వ్యవస్థ అవసరమని, ఈ మేరకు సెన్సస్ 2021 మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిస్తామని అమిత్ షా వెల్లడించారు. ఒకవేళ వ్యక్తి చనిపోతే వెంటనే జనాభా లెక్కల్లో కూడా వెంటనే అప్ డేట్ అయ్యే విధంగా వ్యవస్థ ఉండాలని అందుకు ఈ మల్టీ పర్పస్ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. డిజిటల్‌ జనాభా లెక్కలు చాలా ముఖ్యమని, 2021లో జనాభా లెక్కలను కలం, కాగితం అవసరం లేకుండా డిజిటల్‌ పద్ధతిలో చేపట్టనున్నట్లు తెలిపారు.

దశాబ్దాలుగా జనాభా లెక్కలు సేకరించే విధానాన్ని మార్చుతూ నిర్ణయం తీసుకున్నామని, ఈ సారి జనాభా లెక్కలను రూ.12 వేల కోట్ల ఖర్చుతో.. 16 భాషల్లో చేపట్టనున్నట్లు అమిత్ షా చెప్పారు. 2011 జనగణన ఆధారంగా బీజేపీ ప్రభుత్వం 22 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అమిత్ షా చెప్పారు.

2022నాటికి దేశంలో ఎల్పీజీ కనెక్షన్‌ లేని ఇల్లు ఉండకూడదని, అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అమిత్ షా వివరించారు. కొత్త మొబైల్‌ యాప్‌లో ఎవరైనా కూడా స్వయంగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చని అమిత్ షా చెప్పారు.