Tomota Flu : టమోటా ఫ్లూ వైరస్ లక్షణాలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇటీవలి కాలంలో పలు రకాల వైరస్‌లు   ప్రజల్ని భయబ్రాంతులకు గురి  చేస్తున్నాయి. రోజుకో కొత్త రకం వైరస్ ప్రజలపై   విరుచుకు పడుతోంది.

Tomota Flu : టమోటా ఫ్లూ వైరస్ లక్షణాలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు

tomato flu

Tomota Flu  :  ఇటీవలి కాలంలో పలు రకాల వైరస్‌లు   ప్రజల్ని భయబ్రాంతులకు గురి  చేస్తున్నాయి. రోజుకో కొత్త రకం వైరస్ ప్రజలపై   విరుచుకు పడుతోంది. కోవిడ్‌తో గత రెండేళ్లుగా  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్న  ప్రజలు ఇప్పడు వైరస్‌ల బారిన పడి ఆందోళన చెందుతున్నారు.  ప్రస్తుతం దేశంలో టమోటా ప్లూ ఇన్‌ఫెక్షన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ టమోటా ఫ్లూ ఇన్‌ఫెక్షన్ ముప్పు పిల్లలపై ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కోన్నారు.  పలు రాష్ట్రాల్లో 80మందికి పైగా ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు.

ఈ వ్యాధి సోకిన వారిలో శరీర భాగాలపై టమోటా ఆకారంలో ఉన్న పొక్కులు ఏర్పడతాయి. అందువల్లనే దానికి టొమాటో ఫ్లూ అనే పేరు వచ్చింది. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  ఈ వ్యాధి చేతులు, నోటి ద్వారా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ప్రధానంగా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఈ వ్యాధి సంక్రమిస్తోంది. అయితే పెద్దలలో కూడా వచ్చే అవకాశం ఉంది.

టొమాటో ఫ్లూ వైరస్ సోకిన వారికి ఇతర  వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే జ్వరం, అలసట, ఒళ్లు నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. మరి కొన్ని  లక్షణాలలో అలసట, వికారం, వాంతులు, విరేచనాలు, జ్వరం, నిర్జలీకరణం, కీళ్ల వాపు, శరీర నొప్పులు, సాధారణ ఇన్ ఫ్లూఎంజా వంటి లక్షణాలు కూడా ఉన్నాయి.

ఇది తేలికపాటి జ్వరం,  ఆకలి లేకపోవటం, అనారోగ్యం,  తరచుగా గొంతు నొప్పితో ప్రారంభమవుతుంది. జ్వరం ప్రారంభమైన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత.. శరీరంపై చిన్న ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి పొక్కులుగా, తరువాత   కురుపులుగా మారుతాయి. పుండ్లు సాధారణంగా నాలుక, చిగుళ్లు, బుగ్గల లోపల, అరచేతులు, అరికాళ్లపై వస్తాయి.

ఈ లక్షణాలతో ఉన్న పిల్లలలో డెంగ్యూ, చికున్‌ గున్యా, జికా వైరస్, వరిసెల్లా-జోస్టర్ వైరస్, హెర్పెస్ నిర్ధారణ కోసం మాలిక్యులర్, సెరోలాజికల్ పరీక్షలు చేస్తారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు మినహాయించిన తర్వాత.. టొమాటో ఫ్లూ నిర్ధారణ చేస్తారు.

టొమాటో ఫ్లూ నివారణ చర్యలు
> శిశువులు, చిన్నపిల్లల దుస్తులను తరచూ మార్చకపోవటం…అపరిశుభ్రమైన ఉపరితలాలను తాకడం, నేరుగా నోటిలోకి వస్తువులను, చేతులను పెట్టుకోవడం ద్వారా కూడా టొమాటో ఫ్లూ సంక్రమణకు గురవుతున్నారు.  ప్రస్తుతానికి వ్యాధి-నిర్దిష్ట మందులు అందుబాటులో లేవు కాబట్టి మనం పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.
> దీనికి చికిత్స ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటుంది కాబట్టి   ఐసోలేషన్ లో ఉండటం, విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువగా డాక్టర్లు సూచించిన పళ్ల రసాలు, ద్రవ పదార్ధాలు తీసుకోవడం మంచిది.
> వ్యాధి సోకిన వారికి ఒంటిపై దద్దుర్లు కారణంగా ఏర్పడే చికాకు దురద నుంచి ఉపశమనం కోసం వేడి నీటితో కాపడం పెట్టాలి.

> జ్వరం, ఒళ్లు నొప్పులకు పారాసెటమాల్ తీసుకోండి.
> ఇతర పిల్లలకు లేదా పెద్దలకు  వ్యాధి సోకకుండా నిరోధించడానికి ఏదైనా లక్షణం కనిపించినప్పటి నుంచి ఐదు నుంచి ఏడు రోజుల పాటు రోగిని ఐసోలేషన్‌లో ఉంచండి.
నివారణకు ఉత్తమ పరిష్కారం సరైన పరిశుభ్రత. చుట్టు పక్కల పరిసరాలను శుభ్రపరచడం, అలాగే వ్యాధి సోకిన పిల్లలకు చెందిన బొమ్మలు, బట్టలు, ఆహారం ఇతరులు  ఉపయోగించకుండా చూడాలి.

> జ్వరం లేదా దద్దుర్లు ఉన్న పిల్లలను ఇతర పిల్లలు తాకవద్దని చెప్పండి.
> నోట్లో వేలు వేసుకునే అలవాటు, లేదా బొటనవేలు చప్పరించే అలవాట్లను ఆపమని పిల్లలకు సూచించండి.
> ముక్కు కారుతున్నప్పుడు లేదా దగ్గు వచ్చినప్పుడు రుమాలు ఉపయోగించమని పిల్లలను ప్రోత్సహించండి.

> ఒంటిపై ఏర్పడిన పొక్కును గీసుకోవడం లేదా రుద్దడం   చేయకూడదు. పిల్లలను హైడ్రేటెడ్‌గా ఉంచాలి.
> చర్మాన్ని శుభ్రం చేయడానికి లేదా పిల్లలను స్నానం చేయించడానికి  ఎల్లప్పుడూ వేడి నీటిని ఉపయోగించండి.
> అంటు వ్యాధిని  గుర్తించటానికి  పరీక్ష చేయాలి, తద్వారా నివారణ చర్యలు ప్రారంభించవచ్చు.

తొలుత దేశంలో కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో ఈ ఇన్‌ఫెక్షన్ వచ్చింది. మే 26న తొలికేసు నమోదవగా, జూలై 26 నాటికి బాధితుల సంఖ్య 82 కి చేరింది.  కేరళలతో పాటు తమిళనాడు, ఒడిశా, హర్యానాలోనూ టమోటా ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. అయితే టమోటా ఫ్లూకి కరోనా వైరస్, మంకీపాక్స్, డెంగ్యూ, చికెన్ పాక్స్ లతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Also Read : Dengue : డెంగ్యూతో బాధపడేవారు ఈ ఆహారాల జోలికి వెళ్లొద్దు!