ఏపీ సీఎం జగన్ బాటలోనే: పాదయాత్రకు రజనీకాంత్

ఏపీ సీఎం జగన్ బాటలోనే: పాదయాత్రకు రజనీకాంత్

శివాజీ రాజ్ గైక్వాడ్.. అలియాస్ రజనీకాంత్.. 22ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ పక్కా చేశాడు. ఎంత కేంద్రం నుంచి బీజేపీ మద్ధతు ఉందని రూమర్లు వస్తున్నా.. తానుగా నిలిచేందుకు రజనీ కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏపీ సీఎం జగన్ బాటలో నడవనున్నారట. నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రను ఎంచుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 69ఏళ్ల వయస్సులో రజనీ చేసే పాదయాత్ర ఏ పాటి క్రేజ్ సంపాదించుకుంటుందో చూడాలి. 

2017 డిసెంబరు 31న రాజకీయాలపై ప్రకటన చేసినప్పటికీ తర్వాత దూరంగానే ఉన్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు CAA, NRC, NRPలపై కామెంట్లు చేస్తూ రాజకీయాల్లోకి రానున్నట్లు కనిపించాడు. ఈ మేరకు అధికార ప్రతినిధి రజనీ ఏప్రిల్ 14నుంచి రాజకీయాల్లోకి అఫీషియల్ ఎంట్రన్స్ చేయనున్నట్లు వెల్లడించాడు. 

ఏప్రిల్ 14 తర్వాత ఎప్పుడైనా లాంచ్ చేయొచ్చని వర్గాలు వెల్లడిస్తున్నాయి. చాలా మంది రజనీకాంత్.. బీజేపీ వల్ల ప్రభావితమయ్యారని, అంతేకాకుండా చెన్నైలో ఉన్న ఆర్ఎస్ఎస్ లీడర్ ఎస్ గురుమూర్తి ప్రభావం కూడాఉందని అంటున్నారు. రజినీకాంత్‌కు బీజేపీ సహాయం కచ్చితంగా ఉంటుందని కొన్ని వర్గాలు చెప్పుకొస్తున్నాయి. 

దక్షిణాదిలో కేంద్రం బలం పెంచుకోవడానికి తమిళనాడులో ఉన్న పార్టీలు కాకుండా రజనీ అయితే బెటర్ అని బీజేపీ భావిస్తోందని సమాచారం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రజనీకి సలహాదారుగా, రాజకీయ విశ్లేషకుడిగా రొటీన్ ఎఫైర్స్ చూసుకునే పదవిలో తమిళరువి మణియన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు మణియన్ మాట్లాడుతూ.. రజినీకాంత్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది స్పష్టత లేదన్నారు.