AP Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైంది.. ఏమాత్రం అవినీతి, మనీలాండరింగ్ జరగలేదు
ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున అన్ని విషయాలు అక్కడే చెబుతామని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ చెప్పారు.

Siemens Company Former MD Suman Bose
Siemens Company Former MD Suman Bose: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే, స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయంపై సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు నిరాధారమైందని అన్నారు. ఈ ప్రాజెక్టు నూరుశాతం విజయవంతమైందని, దీనిలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు.
సీమెన్స్ కంపెనీతో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కి మధ్య ఒప్పందం ఉందని, అన్నీ అధ్యయనం చేసిన తరువాతే ఈ ప్రాజెక్టు ప్రారంభించామని సుమన్ బోస్ తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కోసం ముందుకొచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగా మొత్తం 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా 2021 నాటికి 2.32 లక్షల మంది నైపుణ్యం సాధించడం ద్వారా వారికి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగిందని సుమన్ బోస్ తెలిపారు. 2021లోనే ప్రాజెక్టుకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని చెప్పారు.
ఇదేతరహా ప్రాజెక్టును చాలా రాష్ట్రాల్లో అమలు చేశామని, ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున అన్ని విషయాలు అక్కడే చెబుతామని సుమన్ బోస్ చెప్పారు. తాను మీడియా ముందుకు రావడానికి కారణం జీవితంలో తాను సంపాదించుకున్నది గౌరవాన్నని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ 100శాతం విజయవంతమైన ప్రాజెక్ట్ అని, 2016లో విజయవంతమైన ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఎవరైనా ప్రాజెక్టు ఫలితాలు చూసి మాట్లాడితే బాగుంటుందని సుమన్ బోస్ వ్యాఖ్యానించారు.