జనసేన సిద్ధం: రెండు రోజుల్లో ఫస్ట్ లిస్ట్.. వీళ్ల పేర్లు ఉండొచ్చు

  • Published By: vamsi ,Published On : March 11, 2019 / 03:35 AM IST
జనసేన సిద్ధం: రెండు రోజుల్లో ఫస్ట్ లిస్ట్.. వీళ్ల పేర్లు ఉండొచ్చు

సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నెలరోజుల వ్యవధిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎన్నికల హీట్ మొదలైంది. షెడ్యూల్‌ రావడంతో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం నిర్వహించండం వంటి ప్రణాళికలు ఆయా పార్టీలు మరింత వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని అంటున్నారు ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అభ్యర్థుల ఎంపికపై జిల్లాల వారీగా సమీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే పరిశీలించి అధినేతకు పంపినట్లు తెలిపారు. 
అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల పొత్తలపై చర్చలు చివరి దశకు వచ్చాయని, తొలి జాబితా సిద్ధంగా ఉందని వెల్లడించారు. రెండు రోజుల్లో అధినేత పవన్ కళ్యాణ్ జాబితాను విడుదల చేస్తారని వెల్లడించారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు పవన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల్లో విడుదల చేయనున్న జాబితాలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులతో పాటు కొన్ని లోక్ సభ స్థానాల అభ్యర్ధుల పేర్లు ఉండవచ్చని తెలుస్తుంది. తొలి జాబితాలో తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన కొన్ని నియోజవర్గాలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే జనసేన తొలి అభ్యర్థిగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నుంచి బీసీ నేత పితాని బాలకృష్ణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. 
ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, రాజమహేంద్రవరం రూరల్ నుంచి కందుల దుర్గేష్, తుని నుంచి రాజా అశోక్ బాబు, మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, కాకినాడ రూరల్ నుంచి అనిశెట్టి బుల్లెబ్బాయి, పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ పేర్లతో జాబితా ఉండే అవకాశం ఉంది. ఇక గుంటూరు జిల్లాలో తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ పేర్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది.