Dakshinayanam : నేటి నుంచి దక్షిణాయనం ప్రారంభం

భారతీయ హిందూ సాంప్రదాయాల్లో ప్రాచీన కాలంనుంచి కాల గణన చేశారు. ప్రతి సంవత్సరాన్ని రెండుగా విభజించారు. ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు.

Dakshinayanam : నేటి నుంచి దక్షిణాయనం ప్రారంభం

Dakshinayanam

Dakshinayanam : భారతీయ హిందూ సాంప్రదాయాల్లో ప్రాచీన కాలంనుంచి కాల గణన చేశారు. ప్రతి సంవత్సరాన్ని రెండుగా విభజించారు. ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు. సూర్యుడు 12 రాశుల్లో ప్రవేశించే కాలాన్నిబట్టి ప్రతినెలా సంక్రాంతి వస్తుంది. ఆ గమనంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఆరోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఆచరిస్తారు. ఆదే విధంగా మకరానికి ఆరవ రాశి అయిన కర్కాటకంలోని సూర్యుడు ప్రవేశించే కాలాన్ని దక్షిణాయానంగా వ్యవహరిస్తారు.

సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని…. సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని…సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని…సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని.. ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి ‘జరగటం’, ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు.

ఆ క్రమంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయాన్ని కర్కాటక సంక్రమణం అంటారు. ఈరోజు నుంచి సూర్యుడు మకరంలోకి ప్రవేశిచేంత వరకు దక్షిణాయనంగా పిలుస్తారు. ఏ తిథులతోను సంబంధం లేకుండాను, ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ-దక్షిణాయన మనేవి. జనవరి 14న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ, జూలై 16న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.

అనగా కర్కాటక సంక్రమణ సమయం నుంచి కాలంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. దానితో మానవుని జీవితం కూడా ప్రభావితమవుతుంది. దీనికి ఉదాహరణ కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం అనగా ఈ సమయం వర్షాకాలం. ఈ సమయంలో పంటలు, వ్యవసాయ పనులు ప్రారంభమై ఊపందుకొంటాయి. అదేవిధంగా మిగిలిన మూడు నెలలు చలికాలం వస్తుంది.  ఈదక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. ఇక ఆధ్యాత్మికంగా ఇది చాలా విలువైన కాలం. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.

శ్రావణ నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాస దీక్ష చేసే కాలం. ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా విశ్వసిస్తారు. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్లే సమయం ఇది. ఆషాఢ శుక్ల ఏకాదశిని హరి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు యోగనిద్రలో గడిపిన విష్ణువు తిరిగి ద్వాదశి లేదా ఉత్థన ద్వాదశి నాడు యోగనిద్ర నుంచి బయటకు వస్తాడని ప్రతీతి. ఇక ఈ సమయంలోనే ముఖ్య పండగలన్నీ వస్తాయి. ఏ శుభకార్యాలకైనా ఉత్తరాయనం మిక్కిలి శ్రేష్ఠము. గృహప్రవేశము, దేవతాప్రతిష్ఠ, వివాహము, చౌలము, ఉపనయనం, ఈ శుభకర్మలు ఉత్తరాయణంలో చేయాలి. నిందితమైన కర్మలు దక్షిణాయనంలో చేయాలి.

దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని, లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.

16జూలై 2021నుంచి దక్షిణాయణం ప్రారంభం ఈ రోజు దక్షిణాయన పుణ్యకాల సమయం:  ఉదయం.గం.5.47నిమిషాల నుంచి సాయంత్రం గం.4.53నిమిషాల వరకు ఉంటుందని పండితులు తెలియ చేశారు. ఈ మధ్య కాలంలో సూర్యభగవానుడి కటక రాశి ప్రవేశ సమయంలో అంటే సాయంత్రం గం.4.54నిమిషాలకు స్నానం ఆచరించి ఆదిత్య హృదయమును గానీ సూర్యమండల స్తోత్రములను చదువుకోవడం వలన శుభఫలితాలను పొందగలరని పండితులు తెలిపారు. దక్షిణాయ పుణ్యకాల మహా పుణ్య కాల సమయాల్లో పితృదేవతలను ఉద్దేశించి చేసే దానాలు సాధారణ రోజులలో కన్నా  వెయ్యి రెట్లు ఉన్నత ఫలితాలను ఇస్తాయి. సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది.

ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు. ఈరోజు పుణ్యనదీ స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. మనందరము కూడా దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావి తరాలకు మన సంస్కృతిని తెలియజేద్దాం.dakshinayanam