IND vs ENG: ఎర్రమట్టిలో నేడే మూడవ టీ20.. రోహిత్ వచ్చేస్తాడా?

నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో విజయం తర్వాత ఆడుతోన్న టి20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడి.. రెండవ మ్యాచ్‌లో గెలిచి.. వరల్డ్ టాప్ జట్టుపై తడబడి నిలబడి.. సీరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

IND vs ENG: ఎర్రమట్టిలో నేడే మూడవ టీ20.. రోహిత్ వచ్చేస్తాడా?

India Vs England1

India vs England, 3rd T20I – నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో విజయం తర్వాత ఆడుతోన్న టి20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడి.. రెండవ మ్యాచ్‌లో గెలిచి.. వరల్డ్ టాప్ జట్టుపై తడబడి నిలబడి.. సీరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మూడవ టీ20లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధం అవుతోంది భారత్.. ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్న స్థితిలో ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌లో ముందంజలో ఉంటుంది.

మొదటి రెండు మ్యాచ్‌లకు రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో రాహుల్ స్థానంలో రోహిత్‌ శర్మనే ఓపెనర్‌గా ఆడించనున్నాడు. రెండవ టీ20 మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కు బలం కాగా.. వరుసగా రెండు మ్యాచ్‌లలో 1, 0 పరుగులు మాత్రమే చేసిన రాహుల్‌ స్థానంలో రోహిత్‌ వచ్చే అవకాశం ఉంది. గత రెండేళ్లలో భారత్‌ తరఫున టి20ల్లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా ఉన్న రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వకుండా.. ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇస్తారా? అనేది కూడా ప్రశ్నే.

ఇక రెండవ టీ20తో కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పంత్, అయ్యర్‌ కూడా చెలరేగితే జట్టు భారీ స్కోరు చెయ్యవచ్చు. అరంగేట్రం మ్యాచ్‌లో బ్యాటింగ్‌ అవకాశం దక్కని సూర్య కుమార్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. బౌలింగ్‌లో టీమిండియా మార్పులు ఉండకపోవచ్చు. స్పిన్నర్లు చహల్, సుందర్‌ ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. శార్దుల్‌ తన బౌలింగ్‌తో ఆకట్టుకోగా, హార్దిక్‌ పూర్తి కోటా బౌలింగ్‌ చేస్తున్నాడు. పునరాగమనంలో భువనేశ్వర్‌ కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు.

ఇంగ్లాండ్ జట్టులో బ్యాట్స్‌మెన్‌లకు, బౌలర్లుకు కొదవే లేదు.. జట్టులో చివరివరకు భారీ షాట్‌లు కొట్టే ప్లేయర్లు ఉండడం ఆ జట్టుకు బలమే.. జాసన్ రాయ్, బట్లర్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తే మలాన్, బెయిర్‌స్టో ముందుకు తీసుకెళ్లగలరు. తర్వాత మోర్గాన్‌.. ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ ఇంగ్లండ్‌కు ఉన్నారు. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని రెండో స్పిన్నర్‌గా మొయిన్‌ అలీకి అవకాశం దక్కవచ్చు అని అంటున్నారు. అదే జరిగితే.. టామ్‌ కరన్‌ను పక్కన పెట్టవచ్చు. వుడ్ కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా.. జోర్దాన్‌ను పక్కనబెట్టే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకం కానున్నట్లు చెబుతున్నారు. టెస్ట్‌లు ఆడిన ఎర్రమట్టి పిచ్‌పై ఈ రోజు మ్యాచ్ ఆడనున్నారు. కాబట్టి స్పిన్నర్లకు ఎక్కువగా వికెట్లు దక్కే అవకాశం ఉంది. తొలి రెండు టీ20లకు నల్లమట్టి పిచ్‌లను వాడగా.. ఎర్రమట్టి పిచ్‌లపై మణికట్టు మాయాజాలం ప్రదర్శించే స్పిన్నర్లకు లాభించే అవకాశం ఉంది.

భారత్ జట్టు(Probable XI): విరాట్ కోహ్లి(c‌), రాహుల్‌/రోహిత్, కిషన్, పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చాహల్‌.
ఇంగ్లండ్(Probable XI)‌: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, మోర్గాన్, సామ్ కుర్రాన్, మోయిన్ అలీ, వుడ్/ క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్