Lasith Malinga: యార్కర్ కింగ్ ఇక ఆడరు.. రిటైర్మెంట్ ప్రకటించిన మలింగ!

శ్రీలంక స్టార్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

10TV Telugu News

Lasith Malinga: శ్రీలంక స్టార్ ఫాస్ట్ బౌలర్, యార్కర్ కింగ్ లసిత్ మలింగ అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మలింగ ఇప్పటికే టెస్టులు మరియు వన్డేలకు రిటైర్మెంట్ ఇవ్వగా.. తన సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని లసిత్‌ మలింగ్‌ స్పష్టం చేశారు. తాను క్రికెట్‌ ఆడకున్నా ఆటపై ప్రేమ అలాగే ఉంటుందని వెల్లడించారు లసిత్‌ మలింగ.

మలింగ 2020లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను 6 మార్చి 2020న వెస్టిండీస్‌తో ఆడాడు. మలింగ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా మలింగ నిలిచాడు.

ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అతడిదే.. మొత్తం 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీశాడు మలింగ. అతని అత్యుత్తమ ప్రదర్శన 13 పరుగులకు ఐదు వికెట్లు. ఈ ఏడాది యూఏఈ, ఒమన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక ఎంపిక చేసిన 15మంది సభ్యుల జట్టులో మలింగకు చోటు దక్కలేదు. శ్రీలంక సెలెక్టర్లు దాసున్ శనకను జట్టు కెప్టెన్‌గా నియమించారు. 83 టీ20 ల్లో మలింగ 107 వికెట్లు తీశాడు. 6 పరుగులకు 5 వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శన.

లసిత్‌ మలింగ తన అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏకంగా 30 టెస్ట్‌‌లు, 226 వన్డేలు, 83 టీ 20 మ్యాచ్‌ లు మరియు 122 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌ లు ఆడాడు. ఇప్పటి వరకు 500 పైగా వికెట్లు పడగొట్టాడు.

10TV Telugu News