ఫేక్ అకౌంట్లపై నిఘా : మొబైల్ నెంబర్లతో ప్రొఫైల్ వెరిఫికేషన్

సోషల్ మీడియా యూజర్లు జర జాగ్రత్త. ఆన్ లైన్ లో పేరుకుపోయిన సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లపై వార్ మొదలైంది.

  • Published By: sreehari ,Published On : May 3, 2019 / 07:21 AM IST
ఫేక్ అకౌంట్లపై నిఘా : మొబైల్ నెంబర్లతో ప్రొఫైల్ వెరిఫికేషన్

సోషల్ మీడియా యూజర్లు జర జాగ్రత్త. ఆన్ లైన్ లో పేరుకుపోయిన సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లపై వార్ మొదలైంది.

సోషల్ మీడియా యూజర్లు జర జాగ్రత్త. ఆన్ లైన్ లో రోజురోజుకీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫేక్ అకౌంట్లపై వార్ మొదలైంది. మీ యూజర్ ప్రొఫైల్ అకౌంట్లపై నిఘా పెట్టారు. మీరు వాడే ప్రొఫైల్ అకౌంట్ మీదేనా? ఓసారి చెక్ చేసుకోండి.. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్.. ఒక్కో ప్రొఫైల్ అకౌంట్ ను వెరీఫై చేయనున్నారు. మొబైల్ నెంబర్ల ద్వారా సోషల్ మీడియా అకౌంట్లు ఫేక్ లేదా రియల్ అకౌంట్లో కనిపెట్టబోతున్నారు. మీరు వాడే సోషల్ మీడియా అకౌంట్లు ఫేక్ అని తెలిస్తే అంతే సంగతులు.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల నుంచి ఫేక్ అకౌంట్లను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. 

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), సోషల్ దిగ్గజాలు కలిసి సంయుక్తంగా ఫేక్ అకౌంట్ల భరతం పట్టబోతున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్ లో యూజర్ ప్రొఫైల్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంది. ప్రముఖుల ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లకు ప్రత్యేకించి ‘బ్లూ టిక్’మార్క్ ఉంటుంది. అంటే.. వీరి అకౌంట్లపై ప్రొఫైల్ వెరిఫికేషన్ అయినట్టే. కానీ, కొంతమంది మాత్రమే ఈ తరహా అకౌంట్లను వినియోగిస్తున్నారు. మిగతా యూజర్ల అకౌంట్లకు బ్లూ టిక్ మార్క్ లేకపోవడంతో అది ఫేక్ లేదా రియల్ అకౌంటో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. 

యూజర్ల ప్రైవసీపై ఫోకస్ : 
దీనికితోడు సోషల్ మీడియాలో సామాజిక వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఫేక్ న్యూస్ తమ అకౌంట్లలో పోస్టు చేస్తూ అసత్య ప్రచారానికి దిగుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేకించి యూజర్ల ప్రైవసీకి సంబంధించి పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే యూజర్ల ప్రైవసీ విషయంలో సోషల్ దిగ్గజం ఫేస్ బుక్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదకగా ఫేక్ న్యూస్ స్ర్పెడ్ కాకుండా అడ్డుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు నిఘా పెట్టాయి. ఈ క్రమంలో ప్రతి యూజర్ అకౌంట్ ను నిశితంగా పరిశీలిస్తున్నారు.

ప్రొఫైల్ వెరిఫై తప్పనిసరి : 
ప్రభుత్వం చొరవతో MeitY నేతృత్వంలోని ఐటీ, పార్లమెంటరీ కమిటీ అధికారులు ఫేక్ అకౌంట్ల తొలగింపుపై చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై యూజర్ల అకౌంట్లను కచ్చితంగా వెరిఫి చేయాల్సి ఉందన్నారు. ప్రొఫైల్ వెరిఫై చేసి ఫేక్ అకౌంట్లను తొలగిస్తామన్నారు. యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్ల ప్రొఫైల్ వెరిఫికేషన్ చేయడం గుడ్ ఆప్షన్ గా తెలిపారు. స్టేక్ హోల్డర్లు ప్రతిపాదనల ఆధారంగా మంత్రిత్వశాఖ ఫేక్ అకౌంట్ల తొలగింపుపై దృష్టి పెట్టినట్టు అధికారి వెల్లడించారు. 

మీ ప్రొఫైల్ కు బ్లూ టిక్ మార్క్ లేదా?  :
ఫేక్ యూజర్ల అకౌంట్లపై ప్రభుత్వం చేపట్టనున్న చర్యలపై మరో సీనియర్ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. సోషల్ మీడియా దిగ్గజాల్లో ఫేస్ బుక్, గూగుల్ ఇప్పటికే యూజర్ల అకౌంట్లకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రాసెస్ ద్వారా వెరిఫై చేస్తున్నట్టు తెలిపారు. ఈ విధానం ద్వారా యూజర్ల అకౌంట్లకు మరింత సెక్యూరిటీ ఉంటుందని చెప్పారు. ఇతరులు యూజర్ల అకౌంట్లను దుర్వినియోగం చేయకుండా ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఈ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎంతో ఉపకరిస్తుందని అధికారి వెల్లడించారు. ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్ సోషల్ దిగ్గజాలు తమ ప్లాట్ ఫాంలపై యూజర్ల ప్రొఫైల్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తూనే ఉన్నాయి. అయితే.. యూజర్ నేమ్ వెరిఫై అయితే.. సదరు అకౌంట్ ప్రొఫైల్ పై బ్లూ టిక్ మార్క్ కనిపిస్తుంది. కానీ, కొందరు యూజర్లుకు మాత్రమే ఈ బ్లూ టిక్ మార్క్ ఉంటుంది.

ఇదే తరహాలో వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ యూజర్ల అకౌంట్ల ప్రొఫైల్స్ ను వెరిఫై చేసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం అంచనా ప్రకారం.. ఇండియాలో సోషల్ మీడియా యూజర్లు 35 కోట్లమందికి పైగా ఉంటారని మరో అధికారి వివరించారు. సోషల్ మీడియాలో కోట్లాది మంది యూజర్ల అకౌంట్లను మొబైల్ నెంబర్ల ఆధారంగా వెరిఫై చేసినట్టయితే.. ఫేక్ అకౌంట్లను పూర్తిగా తొలగించేందుకు ఆస్కారం ఉంటుందని  మంత్రిత్వశాఖ భావిస్తోంది. అదేగాని జరిగితే.. ఫేక్ అకౌంట్లకు కాలం చెల్లినట్టే అవుతుంది.