Wind Energy : ఇదొక్కటి ఉంటే చాలు.. 80వేల ఇళ్లకు కరెంట్!

ప్రపంచం దేశాల్లో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు అనేక పరిశోధనలు చేసి భవిష్యత్తు తరాలకు మంచిగా ఉపయోగపడే పరికరాలను తయారు చేస్తున్నారు. తాజాగా నార్వే దేశానికి చెందిన ఓ కంపెనీ గాలి ద్వారా విద్యుత్ తయారు చేసే కొత్త పరికరం తయారు చేసింది. దీని ద్వారా ఒకేసారి 80 వేల ఇళ్లకు విద్యుత్ ఇవ్వొచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Wind Energy : ఇదొక్కటి ఉంటే చాలు.. 80వేల ఇళ్లకు కరెంట్!

Wind Energy

Wind Energy : గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే పద్దతి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎత్తైన కొండప్రాంతాల్లో పొడవాటి పిల్లర్లు ఏర్పాటు చేసి వాటికి ఫ్యాన్లను అమర్చుతారు. గాలికి ఫ్యాన్లు తిరిగినప్పుడు వాటిలోపల ఉన్న యంత్రాల ద్వారా విద్యుత్ తయారవుతుంది. అయితే ప్రపంచం మొత్తం వినియోగించే విద్యుత్ లో ఈ గాలిమరల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ చాలా తక్కువనే చెప్పొచ్చు.

అయితే గాలిద్వారా మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. తక్కువ గాలి వీచే ప్రదేశాల్లో కూడా ఎక్కువ విద్యుత్ తయారు చేసే విధంగా పరికరాలను రూపొందిస్తున్నాయి. ఇక తాజాగా నార్వేకు చెందిన ఓ కంపెనీ డబ్ల్యూసీఎస్‌ (విండ్‌ క్యాచింగ్‌ సిస్టం) ను అధునాతన పద్దతిలో రూపొందించింది.

ఫొటోలో కనిపిస్తున్నది గాలిమర. పైగా ఇది నీటిలో తేలుతుంది. వాతావరణం క్షణాల్లో మారే సముద్రపై గాలిమరలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నార్వేకు చెందిన సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. చతురస్రాకారంలో వెయ్యి అడుగుల ఎత్తు ఉండే ఈ నిర్మాణం ద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఇప్పటికే ఈ ప్రయోగం సక్సెస్ అయింది. ఇందులో వందల సంఖ్యలో చిన్న చిన్న ఫ్యాన్లను అమర్చి, డివైడ్‌ అండ్‌ రూల్‌ పద్ధతిని అమలు చేశారు.

వీటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. కానీ అవి ఉత్పత్తి చేసే విద్యుత్‌ మాత్రం ఒకే చోట నిల్వ అవుతుంది. ఇక ఈ సిస్టమ్ లో ఓ ఫ్యాన్ పనిచేయకపోయినా వచ్చే నష్టం ఏమి లేదు. మిగతా ఫ్యాన్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధానం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 80 వేల గృహాలకు అందించవచ్చని నార్వేకు చెందిన పరిశోధన సంస్థ తెలిపింది. త్వరలో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.