Errabelli Pradeep Rao : టీఆర్ఎస్‌కు షాక్..! మంత్రి ఎర్రబెల్లి సోదరుడి రాజీనామా?

టీఆర్ఎస్ పార్టీలో రౌడీలు, గూండాలు, భూకబ్జాదారులకు తప్ప తన లాంటి నాయకులకు కనీసం గుర్తింపు లేదని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వాపోయారు.

Errabelli Pradeep Rao : టీఆర్ఎస్‌కు షాక్..! మంత్రి ఎర్రబెల్లి సోదరుడి రాజీనామా?

Errabelli Pradeep Rao : టీఆర్ఎస్ పార్టీని వీడటం ఖాయం అంటున్నారు వరంగల్ జిల్లాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ముఖ్య నాయకులతో చర్చించాక ఏ పార్టీలో చేరడం అనే దానిపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. ఈ నెల 7న పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. టీఆర్ఎస్ లో తనకు, తన కార్యకర్తలను సరైన ప్రాధాన్యం లభించడం లేదన్నారు. కుటుంబం వేరు, రాజకీయాలు వేరు అన్నారు.

ఇంతకు ముందు తాను ప్రజారాజ్యం పార్టీలో ఉంటే, తన సోదరుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో ఉన్నారని గుర్తు చేశారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తుందని ప్రశ్నించారు ఎర్రబెల్లి ప్రదీప్ రావ్. తాను తక్షణమే బీజేపీలోకి వెళ్తానని ఎక్కడా చెప్పలేదన్నారు. అయితే ఆ పార్టీ నుంచి ఆహ్వానం ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో రౌడీలు, గూండాలు, భూకబ్జాదారులకు తప్ప తన లాంటి నాయకులకు కనీసం గుర్తింపు లేదని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వాపోయారు.

ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా చేస్తే వరంగల్ తూర్పులో టీఆర్ఎస్‌కు షాక్ తగిలినట్లు అవుతుంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈనెల 7న ఢిల్లీలో అమిత్ షాను కలవనున్నారని తెలుస్తోంది. అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌లో ప్రదీప్‌రావు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ప్రదీప్‌రావు వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో హైదరాబాద్ రావాలని ప్రదీప్‌రావును కేసీఆర్ ఆదేశించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో పార్టీ మార్పునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు కొనసాగగా ఇప్పుడు ఆ పార్టీలోంచి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి వలసలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్ లో టీఆర్ఎస్ నుండి భారీగా వలసలు ఉంటాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి.